ఆంధ్రప్రదేశ్: పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్
పర్యాటకుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పర్యాటక ప్రదేశాల్లో ప్రత్యేక టూరిస్టు పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసింది. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మరో మంచి కార్యక్రమం చేపట్టామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. 'పోలీసులే మీ స్నేహితులు' అనే కాన్సెప్ట్ తీసుకురాగలిగామని, గతంలో లేని విధంగా పోలీసు వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చామన్నారు. యాత్రికులు నిర్భయంగా పర్యాటక ప్రదేశాల్లో గడిపేందుకు ఈ పోలీస్ స్టేషన్లు ఉపయోగపడతాయని సీఎం జగన్ చెప్పారు.
టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సాయం చేయొచ్చు: హోంమంత్రి
టూరిస్ట్ పోలీస్ స్టేషన్ల ప్రారంభంపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఇతర దేశాల నుంచి పర్యాటకులు రాష్ట్రానికి వచ్చినప్పుడు, వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సాయం చేయొచ్చన్నారు. అవసరమైన సమాచారం ఇవ్వడానికి, వాహనాలను అందించడానికి, ప్రథమ చికిత్స చేయడానికి ఈ స్టేషన్‌లు ఉపయోగపడుతాయన్నారు. తాడేపల్లి బాలిక హత్య ఘటనపై హోంమంత్రి మాట్లాడుతూ.. మహిళల భద్రతపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. నిందితులు, బాధితురాలు ఇరుగుపొరుగు వారు కావడం, ఇరువర్గాల మధ్య గొడవలు జరగడం వల్లే హత్య జరిగిందని ఆమె తెలిపారు.