మార్చి 7న నాగాలాండ్ సీఎంగా 'నీఫియు రియో' ప్రమాణస్వీకారం
ఎన్డీపీపీ అధినేత నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నీఫియు రియో ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ మద్దతతో ఆయన ఐదోసారి సీఎం పీఠాన్ని అధిష్టించనున్నారు. కొత్తగా ఎన్నికైన ఎన్‌డీపీపీ ఎమ్మెల్యేలు కొహిమాలో సమావేశమై నేఫియు రియోను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రియో తన పదవిని కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. నాగాలాండ్‌లో బీజేపీ 12 స్థానాల్లో గెలుపొందగా, దాని మిత్రపక్షం ఎన్‌డీపీపీ 25 సీట్లను కైవసం చేసుకుంది. 60మంది సభ్యుల అసెంబ్లీలో ఎన్‌డీపీపీ 40 స్థానాల్లో పోటీ చేయగా, బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేసింది.
రెండు రోజుల్లో బీజేపీ, ఎన్డీపీపీ ఎమ్మెల్యేల సంయుక్త సమావేశం
త్వరలో రియో దిల్లీ వెళ్లి అక్కడ బీజేపీ కేంద్ర నేతలతో భేటీ కానున్నారు. రియో శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారని, మార్చి 7న ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని ఎన్‌డీపీపీ నేత ఒకరు చెప్పారు. మరో రెండు రోజుల్లో బీజేపీ, ఎన్డీపీపీ ఎమ్మెల్యేల సంయుక్త సమావేశం జరగనుంది. నాగాలాండ్‌లో వరుసగా రెండోసారి కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. స్వతంత్రులు నాలుగు స్థానాలను కైవసం చేసుకోగా, జనతాదళ్ యునైటెడ్ ఒక స్థానాన్ని, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) రెండు స్థానాలను గెలుచుకున్నాయి.