Ram Mohan Naidu: ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం చర్యలు: రామ్మోహన్ నాయుడు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో మరిన్ని కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం,కుప్పం,నాగార్జున సాగర్ సమీపంలో,అమరావతి ప్రాంతాల్లో కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. శ్రీకాకుళం,కుప్పం విమానాశ్రయాలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని చెప్పారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సదస్సులో మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయితే ఉత్తరాంధ్ర ప్రాంతం మినీ ఎకనామిక్ సిటీగా అభివృద్ధి చెందుతుందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈవిమానాశ్రయం ప్రాంతీయ అభివృద్ధికి కీలక చోదకశక్తిగా మారుతుందని పేర్కొన్నారు. స్థానికంగా ఉపాధి,ఆర్థిక అవకాశాలు పెరగడం ద్వారా ఉత్తరాంధ్ర నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
విశాఖ ఎకనామిక్ రీజియన్ త్వరలోనే వాస్తవరూపం దాల్చుతుందన్న కేంద్ర మంత్రి
ఉత్తరాంధ్రలో రానున్న రోజుల్లో భారీ స్థాయిలో పారిశ్రామిక అభివృద్ధి జరగనుందని కేంద్ర మంత్రి తెలిపారు.
భోగాపురం విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా నిలిచే ప్రాజెక్టుగా మారుతుందని పేర్కొన్నారు.
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న 'విశాఖ ఎకనామిక్ రీజియన్' కూడా త్వరలోనే సాకారం కానుందని వెల్లడించారు.
రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు.