Delhi: దిల్లీలో మెట్రో ప్రయాణికులకు కొత్త బైక్ టాక్సీ సేవలు
దిల్లీ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్ అందింది. ఇకపై మెట్రో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణికులు బైక్ టాక్సీని కూడా బుక్ చేసుకొనే సదుపాయాన్ని కల్పించారు. ప్రస్తుతం 12 మెట్రో స్టేషన్లలో ఈ సౌకర్యం ప్రారంభమైంది. అలాగే రాబోయే కాలంలో మరిన్ని స్టేషన్లలో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. దిల్లీ మెట్రో ప్రయాణికులు 'డీఎంఆర్‌సీ మొమెంటం' అప్లికేషన్ ద్వారా బైక్ టాక్సీలను సులభంగా బుక్ చేసుకోవచ్చు. మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 'షీరైడ్స్' అనే బైక్ టాక్సీ సర్వీసు కూడా అందుబాటులోకి తేవడం గమనార్హం. ఈ సర్వీస్‌లో మహిళా డ్రైవర్ ఉంటుంది.
12 మెట్రోస్టేషన్లలో సేవలు
దీంతో మహిళా ప్రయాణికులకు మరింత సురక్షితమైన ప్రయాణం జరుగుతుంది. 'షీరైడ్స్' సేవలో ప్రయాణానికి కనీస ధర రూ. 10.గా నిర్ణయించారు. రెండవ రకం సర్వీస్ 'రైడర్' సాధారణ ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంటుంది. ఈవన్నీ ఎలక్ట్రిక్ బైక్‌లు కావడంతో కాలుష్యాన్ని తగ్గిస్తాయి. ఈ సౌకర్యాన్ని ఢిల్లీ మెట్రో డీఆర్‌ఎంసీ 'ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్'తో భాగస్వామ్యంగా ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ సేవ 12 మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉంది, మిగిలిన స్టేషన్లలో ఈ సౌకర్యం మూడు నెలల్లో అందుబాటులో రాబోతుంది.