Page Loader
HCL New Campus: హైదరాబాద్‌లో కొత్త టెక్‌ సెంటర్‌ ప్రారంభించనున్న హెచ్‌సీఎల్‌.. 5 వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగావకాశాలు
హైదరాబాద్‌లో కొత్త టెక్‌ సెంటర్‌ ప్రారంభించనున్న హెచ్‌సీఎల్‌

HCL New Campus: హైదరాబాద్‌లో కొత్త టెక్‌ సెంటర్‌ ప్రారంభించనున్న హెచ్‌సీఎల్‌.. 5 వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగావకాశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2025
08:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ సంస్థ హెచ్‌సీఎల్ త్వరలో హైదరాబాద్‌లో ఒక కొత్త టెక్ సెంటర్‌ను ప్రారంభించబోతోంది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ సి. విజయకుమార్‌తో చర్చలు జరిపారు. ఈ కొత్త సెంటర్ లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసులపై దృష్టి సారించి అత్యాధునిక క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ పరిష్కారాలను అందించనుంది. హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ నిర్మాణం పూర్తయింది, దీని ద్వారా 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

వివరాలు 

వచ్చే నెలలోహెచ్‌సీఎల్ ప్రారంభం  

హెచ్‌సీఎల్ ఇప్పటికే ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో గ్లోబల్ నెట్‌వర్క్ సెంటర్‌గా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తుండగా, ఈ కొత్త సెంటర్ మరింత ఆధునిక సామర్థ్యాలను అందుబాటులోకి తెస్తుందని సి. విజయకుమార్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో హెచ్‌సీఎల్ సేవల విస్తరణకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. కొత్త సెంటర్‌ను వచ్చే నెలలో ప్రారంభించాలని ఆహ్వానించారు.

వివరాలు 

దిగ్గజ సంస్థల ప్రతినిధులతో చర్చలు: 

ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ బృందం పలు అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర ముఖ్య అధికారులు కంట్రోల్ ఎస్, విప్రో, హెసీఎల్, సన్ పెట్రోకెమికల్స్, జేఎస్‌డబ్ల్యూ వంటి సంస్థల ప్రతినిధులతో చర్చించారు.

వివరాలు 

జీసీసీల హబ్‌గా హైదరాబాద్: 

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు భారతదేశంలో హైదరాబాద్ ఒక ప్రధాన కేంద్రంగా మారిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్య వనరులు, పరిశోధనలకు అనువైన వాతావరణం, జీవన ప్రమాణాలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్‌తో శ్రీధర్‌బాబు సమావేశమై తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలను చర్చించారు. "కృత్రిమ మేధస్సు, క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ సిటీస్ వంటి రంగాల్లో తెలంగాణ ప్రగతి" వంటి అంశాలను ప్రాధాన్యంగా చర్చించారు.