Loading...
Omicron RF.5: ఏపీలో కొవిడ్‌ కొత్త వేరియంట్‌ అలర్ట్‌.. 'ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌.5'గా నిర్ధారణ!
ఏపీలో కొవిడ్‌ కొత్త వేరియంట్‌ అలర్ట్‌.. 'ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌.5'గా నిర్ధారణ!

Omicron RF.5: ఏపీలో కొవిడ్‌ కొత్త వేరియంట్‌ అలర్ట్‌.. 'ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌.5'గా నిర్ధారణ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 19, 2026
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నమోదైన కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులకు 'ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌.5 (RF.5)' ఉప వేరియంట్‌ కారణమని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కొవిడ్‌-2 వైరస్‌ కాలక్రమంలో తన జన్యువుల్లో మార్పులు చెందుతూ ఒమిక్రాన్‌ వేరియంట్‌గా పరిణామం చెందిందని, అందులో భాగంగానే ఆర్‌ఎఫ్‌.5 ఉప వేరియంట్‌ ఏర్పడిందని శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. వైఎస్సార్‌ కడప జిల్లాలో గుర్తించిన కొవిడ్‌ పాజిటివ్‌ కేసులకు సంబంధించిన నాలుగు నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ ప్రయోగశాలకు (National Institute of Virology) జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షల కోసం పంపించారు. ఆ పరీక్షల్లో అవి 'ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌.5 వేరియంట్‌కు చెందినవేనని' నిర్ధారణ కావడంతో, ఆ నివేదికను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్వీకరించారు.

వివరాలు

ఉన్నతాధికారులతో మంత్రి వర్చువల్ సమావేశం

పుణె నుంచి వచ్చిన పరీక్షల ఫలితాలు, ఆర్‌ఎఫ్‌.5 వేరియంట్‌ ప్రభావం, రాష్ట్రంలో ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఉన్నతాధికారులతో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) డాక్టర్‌ ఎ. విష్ణువర్ధన్‌ వేరియంట్‌కు సంబంధించిన వివరాలను మంత్రికి తెలియజేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆర్‌ఎఫ్‌.5ను ప్రస్తుతం సాధారణ వేరియంట్‌గానే పరిగణిస్తోందని, ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలిగిస్తుందనే శాస్త్రీయ ఆధారాలు ఇప్పటివరకు లేవని ఆయన వివరించారు.

వివరాలు

ఇర వేరియంట్లతో పోలిస్తే ప్రమాదకరం కాదు

సింగపూర్‌తో పాటు ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాల్లో ఈ వేరియంట్‌ కేసులు ఎక్కువగా నమోదైనప్పటికీ, ఇతర ఒమిక్రాన్‌ ఉప వేరియంట్లతో పోలిస్తే ఇది మరింత ప్రమాదకరమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.

ఆర్‌ఎఫ్‌.5 వేరియంట్‌ సోకినవారిలో సాధారణంగా గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రజలు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ADVERTISEMENT

వివరాలు

రాష్ట్రంలో 16కు చేరిన కొవిడ్‌ కేసులు

శనివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కొవిడ్‌ కేసుల సంఖ్య 16కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ప్రత్యేక కొవిడ్‌ వార్డులను సిద్ధం చేసినట్లు మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు.

అవసరాలకు అనుగుణంగా ఆసుపత్రులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేశామని, కొవిడ్‌ నిర్ధారణకు అవసరమైన పరీక్షా కిట్లు, ఇతర వైద్య సదుపాయాలను కూడా సమకూరుస్తున్నామని ఆయన వెల్లడించారు.

ADVERTISEMENT