LOADING...
Delimitation: లోక్‌సభ సీట్ల పెంపుపై కీలక సిఫార్సు.. 543 నుంచి 824కు పెంచాలని ప్రతిపాదన
లోక్‌సభ సీట్ల పెంపుపై కీలక సిఫార్సు.. 543 నుంచి 824కు పెంచాలని ప్రతిపాదన

Delimitation: లోక్‌సభ సీట్ల పెంపుపై కీలక సిఫార్సు.. 543 నుంచి 824కు పెంచాలని ప్రతిపాదన

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2026
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను భారీగా పెంచాలని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ) సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను 824కు పెంచాలని తాజాగా విడుదల చేసిన అధ్యయన నివేదికలో పేర్కొంది. ఇందులో 373 నియోజకవర్గాలను యథాతథంగా కొనసాగిస్తూ, 59 నియోజకవర్గాలను రెండేసి, 111 నియోజకవర్గాలను మూడేసి స్థానాలుగా విభజించాలని సూచించింది. మొత్తంగా 170 నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) చేపడితే సరిపోతుందని తెలిపింది. నియోజకవర్గాల పునర్విభజనలో పట్టణ జనాభా, ఎస్సీ, ఎస్టీ, మహిళల జనాభా, భాషాపరమైన సమీకరణాలు, భాషా వైవిధ్యం, గత లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని నివేదిక సూచించింది.

వివరాలు 

824 స్థానాలు ఉండాలని ప్రతిపాదించిన ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి

తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్ లోక్‌సభ నియోజకవర్గాలను మూడేసి స్థానాలుగా, చేవెళ్లను రెండుగా విభజించాలని ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్‌లో రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గాలను మూడేసి స్థానాలుగా, మచిలీపట్నం నియోజకవర్గాన్ని రెండుగా విభజించాలని సిఫార్సు చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు నేపథ్యంలో మొత్తం లోక్‌సభ స్థానాలను 815కు పెంచే అవకాశం ఉందని వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి మాత్రం అంతకంటే ఎక్కువగా 824 స్థానాలు ఉండాలని ప్రతిపాదించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వివరాలు 

ఇవీ ప్రధాన సిఫార్సులు..

2024 లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రతి నియోజకవర్గంలో సగటున 18.2 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. పెద్ద నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతోందని, 2009, 2014, 2019, 2024 ఎన్నికల విశ్లేషణలో చిన్న నియోజకవర్గాల్లో ఎక్కువ ఓటింగ్ నమోదైనట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్థానాలను 543 నుంచి 824కు పెంచితే ఓటింగ్ శాతం 2.32 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో దేశవ్యాప్తంగా మరో 2.23 కోట్ల మంది అదనంగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముందని నివేదిక పేర్కొంది. ఈ ప్రతిపాదనల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో 3.52 శాతం, తెలంగాణలో 6.55 శాతం మేర పోలింగ్ పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.

Advertisement

వివరాలు 

హైదరాబాద్‌లో ఉర్దూ మాట్లాడేవారే అధికం

హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఉర్దూ మాట్లాడే వారి సంఖ్య 10.66 లక్షలుగా ఉందని అధ్యయన నివేదిక తెలిపింది. మొత్తం ఓటర్లలో వీరి వాటా 64 శాతం కాగా, తెలుగు మాట్లాడేవారు 28 శాతం, హిందీ మాట్లాడేవారు 5.15 శాతం ఉన్నట్లు పేర్కొంది. జనాభా, భాషా వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాన్ని మూడుగా విభజించాలని సిఫార్సు చేసింది.

Advertisement