TG news: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో కొత్త ఆరోగ్య పథకం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులు, పెన్షనర్లకు త్వరలోనే కొత్త ఆరోగ్య పథకం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో గురువారం (12వ తేదీ) మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కీలక సమావేశం జరగనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోతో పాటు ఇతర ఉన్నతాధికారులు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న పథకంలోని లోపాలను సరిదిద్దుతూ, మరింత సమర్థవంతమైన కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. ఈ కొత్త పథకానికి 'న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం' అనే పేరు పెట్టనున్నారు. దీనిని అమలు చేయడానికి ప్రత్యేకంగా ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్‌సీటీ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వివరాలు
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అందుతున్నాయి. అయితే ఈ సేవలు కాగితాలకే పరిమితమవుతూ, వాస్తవంగా పూర్తి స్థాయిలో అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఉద్యోగుల హెల్త్ కార్డులు చాలా చోట్ల చెల్లుబాటు కావడం లేదు. ఫలితంగా ఉద్యోగులు ముందుగా ఖర్చు చేసి, తరువాత రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసినా బిల్లుల మొత్తం పూర్తిగా తిరిగి రావడం లేదు. కొన్ని సందర్భాల్లో సగం మొత్తం కూడా చెల్లించని పరిస్థితి నెలకొంది.
వివరాలు
ఉద్యోగుల బేసిక్ జీతం నుంచి 1.5 శాతం మేర నగదు భాగస్వామ్యం
కొత్త పథకంలో ఈ సమస్యలకు చెక్ పెట్టేలా మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు సమాచారం. ఉద్యోగుల బేసిక్ జీతం నుంచి 1.5 శాతం మేర నగదు భాగస్వామ్యం విధించే ప్రతిపాదనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉదాహరణకు, ఒక ఉద్యోగికి నెలకు రూ.50,000 బేసిక్ ఉంటే, కొత్త పథకంలో నెలకు సుమారు రూ.750 ఉద్యోగి వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ అంశాలపై గురువారం జరిగే సమావేశంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది. మొదట ఈ పథకాన్ని బీమా విధానంలో అమలు చేయాలనే ఆలోచన చేసిన ప్రభుత్వం, అనంతరం ట్రస్టు విధానంలోనే కొనసాగించాలని తుది నిర్ణయానికి వచ్చింది. ఈ కొత్త ఆరోగ్య పథకం కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు పర్యవేక్షణలోనే అమలవుతుందని అధికారులు తెలిపారు.