New housing scheme: మధ్య తరగతికి కేంద్రం గుడ్ న్యూస్.. గ్రామాల్లో 2కోట్ల ఇళ్ల నిర్మాణం
Budget 2024: సాధారణ ఎన్నికలకు వేళ పార్లమెంట్‌లో గురువారం ప్రవేశపెట్టిన 'మధ్యంతర బడ్జెట్ 2024'లో మధ్య తరగతి వర్గానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామాల్లోని మధ్య తరగతి ప్రజల కోసం ప్రత్యేక గృహనిర్మాణ పథకాన్ని తీసుకువస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా రాబోయే 5ఏళ్లలో 2కోట్ల పక్కా ఇళ్లను నిర్మించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారాఅద్దె ఇళ్లు, మురికివాడల్లో నివసించే ప్రజలు లబ్ధి పొందనున్నారు. కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) కింద 3 కోట్ల ఇళ్లను అందించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
ముద్ర యోజన కింద రూ.22.5 లక్షల కోట్ల రుణాలు
ప్రధానమంత్రి ముద్ర యోజన కింద కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.22.5 లక్షల కోట్ల విలువైన 43 కోట్ల రుణాలు ఇచ్చినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గత పదేళ్లలో మహిళలకు 30 కోట్ల ముద్రా యోజన రుణాలు ఇచ్చామని ఆర్థిక మంత్రి తెలిపారు. దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ మరో ఐదేళ్లపాటు కొనసాగించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. స్కిల్ ఇండియా మిషన్ కింద 1.4 కోట్ల మంది యువతకు శిక్షణ ఇచ్చి నైపుణ్యం కలిగిన వారిని తయారు చేశామన్నారు.