Scroll art: ఏఆర్ స్పర్శతో చేర్యాల పటచిత్ర కళకు కొత్త జీవం
ఈ వార్తాకథనం ఏంటి
గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు కథాగానానికి ప్రాణంలా నిలిచిన చేర్యాల పట చిత్రకళ (స్క్రోల్ ఆర్ట్) కాలక్రమేణా ఆడియో, వీడియో సాంకేతికతల ప్రభావంతో మరుగున పడింది. అంతరించిపోతున్న ఈ సంప్రదాయ కళను ఆధునిక సాంకేతికతతో మేళవించి మళ్లీ ప్రజల్లోకి తీసుకురావడానికి కళాకారుడు సాయికిరణ్ వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. 'ఇమ్మర్సివ్ ఇతిహాస' పేరుతో చేర్యాల చిత్రకళకు అగ్‌మెంటెడ్ రియాలిటీ (ఏఆర్)ను జోడించి, మహాభారతంలోని ఘట్టాలను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శిస్తున్నారు.
Details
ప్రేక్షకులకు సంపూర్ణ అనుభూతి
హైదరాబాద్ రాయదుర్గంలో నిర్వహించిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో 'ఇమ్మర్సివ్ ఇతిహాస: ది చేర్యాల విరాటపర్వ' అనే శీర్షికతో ఈ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. చేర్యాల పట చిత్రానికి ముందుగా ఏర్పాటు చేసిన ట్యాబ్‌ను చూస్తే, వెనుక ఉన్న చిత్రంలోని బొమ్మలు కదులుతున్నట్లు కనిపిస్తాయి. దృశ్యానికి అనుగుణంగా నేపథ్య సంగీతంతో కూడిన కథాగానం హెడ్‌సెట్ ద్వారా వినిపిస్తూ ప్రేక్షకులకు సంపూర్ణ అనుభూతిని అందిస్తోంది. సంప్రదాయ కళకు ఆధునిక సాంకేతికతను జోడించి చేర్యాల చిత్రకళకు కొత్త ఊపిరి పోస్తున్న ఈ ప్రయత్నం విశేష ఆకర్షణగా నిలుస్తోంది.