LOADING...
Andhra Pradesh: అమరావతి రాజధానిలో వరద ముంపు నియంత్రణకు కొత్త ఎత్తిపోతల ప్రణాళికలు
అమరావతి రాజధానిలో వరద ముంపు నియంత్రణకు కొత్త ఎత్తిపోతల ప్రణాళికలు

Andhra Pradesh: అమరావతి రాజధానిలో వరద ముంపు నియంత్రణకు కొత్త ఎత్తిపోతల ప్రణాళికలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2025
01:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమరావతి రాజధానిలో ఎప్పుడూ వరద ముంపు సమస్య తలెత్తకుండా నిలకడైన పరిష్కారాలు చేపట్టేందుకు ప్రభుత్వం శాశ్వత ప్రణాళికను ప్రారంభించింది. ఈ ప్రణాళికలో భాగంగా ఉండవల్లి ప్రాంతంలో ఉన్న ఎత్తిపోతల సమీపంలో ఒకటి,అలాగే కృష్ణానదికి ఎగువ వైకుంఠపురం ప్రాంతంలో మరో ఎత్తిపోతల ప్రాజెక్టు రూపొందిస్తున్నారు. అమరావతి పరిధిలో ప్రధానంగా కొండవీటి వాగు,పాల వాగు,కోటేళ్ల వాగు వంటివి ప్రవహిస్తుంటాయి. ఈ వాగుల్లో పెద్దది కొండవీటి వాగు. కొండల నుంచి చిన్న ప్రవాహంలా ప్రారంభమై సుమారు 29 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, చివరికి ఉండవల్లి ప్రాంతంలో కృష్ణానది హెడ్ రెగ్యులేటర్ వద్ద కలిసిపోతుంది. మధ్యలో పాల వాగు,కోటేళ్ల వాగు కూడా కలిసిపోతాయి.ఈ వాగుల సరిహద్దుల్లో ఎలాంటి ముంపు సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.

వివరాలు 

రూ.237 కోట్లతో కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్టు

అమరావతిని రాజధానిగా ప్రకటించిన సమయంలోనే గత తెదేపా ప్రభుత్వం, నెదర్లాండ్స్‌కు చెందిన ఆర్కాడిస్‌ సంస్థ, టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ సంస్థతో కలిసి సమగ్ర అధ్యయనం చేసి బ్లూమాస్టర్ ప్లాన్ రూపొందించింది. 2017లో మొత్తం 12,350 క్యూసెక్కుల వరద నీటిని ఎత్తిపోసే విధంగా ప్రణాళికను సిద్ధం చేశారు. ముందుగా రూ.237 కోట్లతో కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించి, ఇందులో 5,000 క్యూసెక్కుల వరద నీటిని ప్రకాశం బ్యారేజీలోకి పంపేలా నిర్మించారు. అదేవిధంగా మరో 4,000 క్యూసెక్కులు గ్రావిటీ ద్వారా ఎస్కేప్ రెగ్యులేటర్ ద్వారా బకింగ్‌హామ్ కాలవలోకి వెళ్లేలా రూపొందించారు.

వివరాలు 

ఉండవల్లి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 1,000 క్యూసెక్కులు పెంచాలని నిర్ణయం 

ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు సూచనలను బట్టి మరిన్ని చర్యలు చేపట్టారు. గత సంవత్సరం నుండి ఈ రెండు బ్యాంకుల ప్రతినిధులు పలు సార్లు రాజధానిని సందర్శించి, ముంపు నివారణపై CRDA, ఏడీసీఎల్ అధికారులతో సమగ్ర చర్చలు జరిపారు. ఉండవల్లి ప్రాంతంలోని ప్రస్తుత కొండవీటి వాగు ఎత్తిపోతల పనితీరును పరిశీలించి, వాతావరణ మార్పులు, భవిష్యత్తులో ఉండే అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు మరలా రూపొందించాలని సూచించారు. గత ఏడాది కృష్ణానదిలో వచ్చిన గరిష్ఠ వరదను పరిగణనలోకి తీసుకుని (11.43 లక్షల క్యూసెక్కులు), ఉండవల్లి ఎత్తిపోతల సామర్థ్యాన్ని ఇంకా 1,000 క్యూసెక్కులు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.

వివరాలు 

8,400 క్యూసెక్కుల సామర్థ్యంతో రెండోదశ... 

ఉండవల్లి ప్రాంతంలో కొత్త ఎత్తిపోతల ప్రాజెక్ట్ డిజైన్ సిద్ధం అయింది, దీని సామర్థ్యం 8,400 క్యూసెక్కులు. ఇది గుంటూరు నగరపాలక సంస్థ తాగునీటి ప్రాజెక్ట్ పక్కనే నిర్మించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులో బ్యారేజీలోని నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోసే విధంగా రూపకల్పన చేశారు. డిజైన్‌ను ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఆమోదించింది. త్వరలో CRDA ఆమోదం పొందిన తర్వాత టెండర్లు పిలవనున్నారు.

వివరాలు 

అమరావతిలోకి రాకుండా... 

కృష్ణానదికి ఎగువ వైకుంఠపురం వద్ద మరో ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించాలని అధ్యయనంలో తేల్చారు. ఇది 5,650 క్యూసెక్కుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతానికి ఇది DPR (డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) స్థాయిలో ఉంది. అవసరమైన అనుమతులు పొందిన తరువాత టెండర్ల ప్రక్రియ ప్రారంభం అవ్వనుంది. గుంటూరు జిల్లా లాం నుంచి కొండవీటి వాగు నీటిని పెదపరిమి వరకు తీసుకెళ్లి, అక్కడ గ్రావిటీ కాలువ ద్వారా వైకుంఠపురం తరలిస్తారు. రాజధానిలో ప్రవహించే మూడవంతు వరద నీటిని వైకుంఠపురం ఎత్తిపోతల ద్వారా కృష్ణానదిలోకి పంపేలా ప్రత్యేక డిజైన్ రూపొందిస్తున్నారు. అలాగే, రాజధానిలో నిర్మించనున్న గ్రావిటీ కాలువ వద్ద వాననీటిని సమర్థవంతంగా బయటకు పంపేందుకు చిన్న పంపింగ్ స్టేషన్‌ను కూడా నెలకొల్పనున్నారు.