LOADING...
Rajahmundry - Kakinada MEMU Train : రాజమండ్రి-కాకినాడ మధ్య కొత్త మెమూ రైలు సర్వీస్.. టైమింగ్స్, స్టాప్‌లు ఇవే!
రాజమండ్రి-కాకినాడ మధ్య కొత్త మెమూ రైలు సర్వీస్.. టైమింగ్స్, స్టాప్‌లు ఇవే!

Rajahmundry - Kakinada MEMU Train : రాజమండ్రి-కాకినాడ మధ్య కొత్త మెమూ రైలు సర్వీస్.. టైమింగ్స్, స్టాప్‌లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 24, 2026
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, కాకినాడ వాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు కీలక నగరాల మధ్య కొత్త మెమూ రైలు సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త రైలు ప్రారంభ తేదీ, షెడ్యూల్, స్టాప్‌లు తదితర వివరాలను అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. రాజమండ్రి-కాకినాడ మధ్య రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సర్వీస్ ప్రారంభమైతే తక్కువ ఛార్జీలతో ప్రయాణించే అవకాశం కలగడంతో పాటు రోడ్డు మార్గంలో ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యల నుంచి కూడా ప్రయాణికులకు ఉపశమనం లభించనుంది.

వివరాలు

రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే

దక్షిణ మధ్య రైల్వే తెలిపిన వివరాల ప్రకారం, రైలు నంబర్ 67301 మెమూ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజూ ఉదయం 06:15 గంటలకు కాకినాడ పోర్ట్ నుంచి బయలుదేరి ఉదయం 08:15 గంటలకు రాజమండ్రి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 67302 మధ్యాహ్నం 15:00 గంటలకు రాజమండ్రి నుంచి బయలుదేరి సాయంత్రం 04:40 గంటలకు కాకినాడ పోర్ట్‌కు చేరుకుంటుంది. ఈ సేవలు ఈ నెల 27, 28 తేదీల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రైలు ఆగే స్టేషన్లు ఇలా ఉన్నాయి: కాకినాడ టౌన్, సామర్లకోట, మేడపాడు, బిక్కవోలు, అనపర్తి, ద్వారపూడి.

వివరాలు

మధ్యతరగతి ప్రయాణికులకు పెద్ద ఊరట

ఉదయం కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్లే ప్రయాణికులకు, అలాగే రోజంతా పనులు ముగించుకుని తిరిగి వచ్చే కార్మికులు, ఉద్యోగులకు ఈ సర్వీస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మెమూ రైలు ప్రారంభంతో జిల్లాలోని అంతర్గత ప్రాంతాలు, ప్రధాన నగరాల మధ్య రవాణా అనుసంధానం మరింత బలపడనుంది. ముఖ్యంగా ఆఫీసు వేళలకు అనుగుణంగా ఉండటం వల్ల మధ్యతరగతి ప్రయాణికులకు ఇది పెద్ద ఊరటగా మారనుంది.

Advertisement