షిర్డీ సాయిబాబా ఆలయానికి కొత్త సమస్య; గుట్టలుగా పేరుతున్న నాణేలు; స్థలం లేదంటున్న బ్యాంకులు
షిర్డీ సాయిబాబా ఆలయ చాలా తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. ఆలయానికి నిత్యం రూ.లక్షల్లో నాణేలు విరళంగా వస్తుంటాయి. అయితే ఇప్పుడు వాటిని డిపాజిట్ చేసుకునేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. ఆ నాణేలను తమ బ్యాంక్‌లల్లో పెట్టడానికి స్థలం లేదంటూ అధికారులు వాటిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో ఆలయానికి విరాళంగా వచ్చిన నాణేలు గుట్టలు గుట్టులుగా పేరుకుపోతుండటంతో శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్(ఎస్ఎస్ఎస్‌టీ) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌కు 13ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. వాటిలో డజను బ్యాంకులు షిర్డీలోనే ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో ప్రస్తుతం ఎస్ఎస్ఎస్‌టీ డబ్బు కేవలం నాణేల రూపంలోనే దాదాపు రూ.11 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి.
ఆర్‌బీఐ జోక్యాన్ని కోరుతూ లేఖ రాసే యోచనలో ట్రస్ట్
స్థలం కొరత కారణంగా షిర్డీలోని నాలుగు ప్రభుత్వరంగ బ్యాంకులు ఇప్పుడు నాణేలను తీసుకోవడం మానేశాయని ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ జాదవ్ తెలిపారు. ఇది ట్రస్ట్‌కు పెద్ద సమస్య అని అన్నారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఇప్పటివరకు డిపాజిట్ చేసిన నాణేలను ఉంచేందుకే స్థలం లేదని, కొత్త నాణేలను తీసుకొని ఎక్కడ పెట్టాలని బ్యాంకు అధికారులు తమ గోడును చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రస్ట్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) జోక్యాన్ని కోరుతూ లేఖ రాసే యోచనలో ఉంది. అదే సమయంలో ఇతర బ్యాంకులను కూడా సంప్రదించాలని నిర్ణయించినట్లు రాహుల్ జాదవ్ చెప్పారు. నాణేలను డిపాజిట్ చేసుకునే బ్యాంకుల్లో ట్రస్ట్ ఖాతాలను తెరిచేందుకు సిద్ధమవుతున్నట్లు జాదవ్ తెలిపారు.