Andhra Pradesh: ఏపీలో కొత్త రైల్వే స్టేషన్.. హైదరాబాద్-తిరుపతి రైలు ప్రయాణం ఇక వేగవంతం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే మార్గం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గం (ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లా మీదుగా తిరుపతివైపు) మరికొద్ది నెలల్లోనే పూర్తికానుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నుంచి తిరుపతికి కనెక్టివిటీ మెరుగవ్వడంతో పాటు ప్రయాణదూరం తగ్గనుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఈ రైల్వే లైన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
దర్శి, పొదిలి వరకు ట్రాక్ పనులు పూర్తయ్యాయి. స్టేషన్‌ల నిర్మాణం కూడా తుది దశకు చేరుకుంది.
ఇప్పటికే ఈ మార్గంలో రైళ్ల ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు కనిగిరి వరకు ట్రాక్, రైల్వే స్టేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
Details
కనిగిరివాసులకు త్వరలోనే రైలు సౌకర్యం
కనిగిరి ప్రాంత ప్రజలకు త్వరలోనే రైలు ప్రయాణం సులభతరం కానుంది. కనిగిరి మండలం పోలవరం సమీపంలో రైల్వే స్టేషన్, రెస్ట్రూమ్‌లు పూర్తయ్యాయి.
స్టేషన్‌లో టికెట్ కౌంటర్లు, ఐరన్ బ్రిడ్జ్‌లు నిర్మాణం పూర్తి అయ్యాయి. పునుగోడుకు వెళ్లే మార్గంలో కూడలి నిర్మాణం పూర్తవ్వగా, కొత్తగా బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతోంది.
కనిగిరి మండలం పునుగోడు నుంచి పామూరు మండలం తిరగలదిన్నె వరకు 50 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.
Details
రైల్వే లైన్‌తో పరిహారం పంపిణీ
ఈ కొత్త రైల్వే మార్గ నిర్మాణం వల్ల భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి రైల్వే శాఖ పరిహారం అందించింది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కనిగిరి, పామూరు మండలాల్లోని రైతులకు దాదాపు రూ.13 కోట్లు పరిహారంగా చెల్లించారు.
కనిగిరి ప్రాంతంలో గ్రానైట్ పరిశ్రమ యజమానులతో చర్చలు జరిపి, రైల్వే పనులకు ఎటువంటి ఆటంకాలు రాకుండా చర్యలు తీసుకున్నారు.
పేరంగుడిపల్లి వద్ద కొన్ని సమస్యలు ఎదురైనా, వాటిని పరిష్కరించి సంబంధితులకు స్థల కేటాయించారు.
Details
హైదరాబాద్ - తిరుపతి ప్రయాణానికి మెరుగైన కనెక్టివిటీ
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి నడికుడి వరకు రైల్వే మార్గం ఉంది. ఇప్పుడు నడికుడి నుంచి శ్రీకాళహస్తి వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం కొనసాగుతోంది.
ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి తిరుపతికి మరింత త్వరగా వెళ్లే అవకాశం కలుగుతుంది. ఈ రైల్వే మార్గం ప్రయాణికులకు బాగా ఉపయోగపడనుంది.
రైల్వే అధికారులు వచ్చే నెలలో కరెంట్ లైన్ల పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు.
ఈ ఏడాదిలోనే కనిగిరి, పామూరు మండలాల్లో రైలు సేవలు ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేశారు.