New railway zone: ఏప్రిల్ 1 నుంచి కొత్త రైల్వే జోన్?.. విశాఖపట్నం కేంద్రంగా ద.కోస్తా జోన్ కార్యకలాపాలు
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణమధ్య రైల్వే పునర్విభజన వ్యవహారం ఇప్పుడు తుది దశకు చేరుకుంది. కొత్తగా ఏర్పడబోయే రైల్వే జోన్‌కు సంబంధించిన అపాయింటెడ్ డేను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనున్నట్టు సమాచారం. ఏప్రిల్ 1 నుంచే నూతన జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలన్న దిశగా రైల్వే శాఖ ఆలోచిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే వర్గాలకు సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. ఇది అమల్లోకి వస్తే ఇప్పటివరకు ఆరు డివిజన్లతో సికింద్రాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న దక్షిణమధ్య రైల్వే జోన్ ఇకపై సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లకే పరిమితం అవుతుంది. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో పాటు తూర్పు కోస్తా జోన్‌లోని కొన్ని ప్రాంతాలను కలిపి విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పడనుంది.
వివరాలు
నెలాఖరులోపు అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం
కొత్త జోన్ ప్రారంభానికి సమయం చాలా తక్కువగా ఉండటంతో ఏప్రిల్ 1నే అపాయింటెడ్ డేగా నిర్ణయించడం సాధ్యమా అనే అంశంపై రైల్వే బోర్డు స్థాయిలో చర్చ జరిగినట్లు తెలిసింది. సాంకేతికంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యే అవకాశాలపై కొద్దిరోజుల్లోనే స్పష్టత వస్తుందని, నెలాఖరులోపు అపాయింటెడ్ డేను ఖరారు చేస్తూ అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని దక్షిణమధ్య రైల్వే ప్రధాన కార్యాలయ అధికారులు చెబుతున్నారు. డివిజన్ల వారీ విభజన, సరిహద్దుల మార్పులు, ఆదాయ-వ్యయాల లెక్కలు, రైళ్ల నిర్వహణ వంటి అంశాలతో కూడిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రైల్వే బోర్డుకు ఇప్పటికే తొమ్మిది నెలల క్రితమే పంపించారు.
వివరాలు
పునర్విభజనలో భాగంగా పలు మార్పులు
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సందర్భంగా విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు, ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం 2025 ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. అదే క్రమంలో గత కొన్ని నెలలుగా కొత్త జోన్‌కు సంబంధించిన జనరల్ మేనేజర్, విభాగాధిపతుల నియామకాలను బోర్డు దశలవారీగా చేపడుతోంది. పునర్విభజనలో భాగంగా పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. గుంతకల్లు డివిజన్ పరిధిలో ఉన్న రాయచూరు-వాడి మధ్య 108 కిలోమీటర్ల రైలు మార్గం ఇకపై సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది.
వివరాలు
సికింద్రాబాద్ నుంచి విజయవాడ డివిజన్ పరిధిలోకి.. మోటుమర్రి-కొండపల్లి రైలు మార్గం
ప్రస్తుతం గుంటూరు డివిజన్‌లో ఉన్న విష్ణుపురం-పగిడిపల్లి,విష్ణుపురం-జాన్‌పహాడ్ మార్గాలు కలిపి మొత్తం 142 కిలోమీటర్లు సికింద్రాబాద్ డివిజన్‌కు బదిలీ కానున్నాయి. అలాగే 46 కిలోమీటర్ల మోటుమర్రి-కొండపల్లి రైలు మార్గం సికింద్రాబాద్ నుంచి విజయవాడ డివిజన్ పరిధిలోకి వెళ్లనుంది.