New Rules for TV & Radio Broadcasting: టీవీ,రేడియో ప్రసారాలకు కొత్త రూల్స్.. ఏకీకృత విధానానికి కేంద్రం శ్రీకారం
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని టెలివిజన్,రేడియో ప్రసార రంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు వేర్వేరుగా అమల్లో ఉన్న పలు మార్గదర్శకాలను ఒకే విధానంలోకి తీసుకొస్తూ 'టెలికమ్యూనికేషన్స్ (టెలివిజన్, రేడియో, అనుబంధ సేవలు) రూల్స్-2026' పేరుతో ముసాయిదా నియమావళిని విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. కొత్త టెలికమ్యూనికేషన్స్ చట్టం-2023కు అనుగుణంగా ఈ నిబంధనలను రూపొందించినట్లు వెల్లడించింది. ప్రసార రంగానికి ఏకీకృతమైన, సరళమైన నియమావళిని అందించడం ఈ కొత్త ముసాయిదా ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. టీవీ,రేడియో ప్రసార రంగంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయడంతో పాటు 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'కు ప్రోత్సాహం కల్పించడమే ఈ సంస్కరణల లక్ష్యమని పేర్కొంది.
వివరాలు
ఒకే విధానంలోకి రానున్న సేవలు
కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ప్రస్తుతం అమలులో ఉన్న పలు పాత మార్గదర్శకాలు రద్దు కానున్నాయి. కొత్త ముసాయిదాలో ప్రస్తుతం విడివిడిగా అమల్లో ఉన్న పలు విధానాలను విలీనం చేశారు. ఇందులో శాటిలైట్ టెలివిజన్ ఛానళ్ల అప్లింకింగ్, డౌన్లింకింగ్ మార్గదర్శకాలు, డైరెక్ట్-టు-హోమ్ (డీటీహెచ్) ప్రసార సేవల లైసెన్సింగ్ విధానాలు, హెడ్ఎండ్-ఇన్-ది-స్కై (హెచ్ఐటీఎస్) సేవల నిబంధనలు, ప్రైవేట్ సంస్థల ద్వారా ఎఫ్‌ఎం రేడియో సేవల విస్తరణకు సంబంధించిన ఫేజ్-3 విధానాలు, అలాగే కమ్యూనిటీ రేడియో స్టేషన్ల ఏర్పాటు మార్గదర్శకాలు ఉన్నాయి.
వివరాలు
కొత్త ముసాయిదాలో కీలక మార్పులు
కొత్త నియమావళిలో పలు కీలక సంస్కరణలను ప్రతిపాదించారు. అన్ని రకాల అనుమతుల ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటివరకు తప్పనిసరిగా అమల్లో ఉన్న 'గ్రాంట్ ఆఫ్ పర్మిషన్ అగ్రిమెంట్' (జీఓపీఏ) విధానాన్ని తొలగించనున్నారు. దీంతో అనుమతుల ప్రక్రియ మరింత సులభంగా,వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే ప్రసార రంగంలో తలెత్తే వివాదాల పరిష్కారం కోసం పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముసాయిదాలో ప్రతిపాదించారు.
వివరాలు
సూచనలు, సలహాలు, అభిప్రాయాలను బీపీ అండ్ ఎల్ కి పంపాలి
ఈ మార్పుల ద్వారా ప్రసార రంగంలో పెట్టుబడులు, వ్యాపార కార్యకలాపాలు మరింత సులభతరం అవుతాయని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ముసాయిదా నియమావళిని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ప్రజలు, సంబంధిత వర్గాలు, ఇతర మంత్రిత్వ శాఖల అభిప్రాయాల కోసం అందుబాటులో ఉంచింది. దీనిపై సూచనలు, సలహాలు, అభిప్రాయాలను జులై 27లోపు మంత్రిత్వ శాఖలోని అండర్ సెక్రటరీ (బీపీ అండ్ ఎల్)కు పంపాలని అధికారులు కోరారు.