
Lift Accidents: లిఫ్ట్‌లకు కొత్త భద్రతా కోడ్.. డిసెంబరు 22 నుంచి అమల్లోకి
ఈ వార్తాకథనం ఏంటి
లిఫ్ట్ ప్రమాదాలు పెరుగుతుండటంతో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) లిఫ్ట్ భద్రతా ప్రమాణాలు పెంచింది. యూరోపియన్ ప్రమాణాల మేరకు ఆటోమేటిక్ డోర్ లాకింగ్ వ్యవస్థలు, స్పీడ్ గవర్నర్లు తప్పనిసరిగా అమలు చేయాలని నిర్దేశించింది. ఇప్పుడున్న ఐఎస్ 14665 స్థానంలో కొత్త భద్రతా కోడ్ (IS 17900) అమలులోకి వస్తుంది. దేశవ్యాప్తంగా డిసెంబర్ 22 నుంచి కొత్త లిఫ్ట్ భద్రతా కోడ్‌ను పాటించాల్సి ఉంటుంది. కొత్త కోడ్‌లో ప్రయాణికులు, టెక్‌నీషియన్లు, భవనాల భద్రత కోసం లిఫ్ట్‌లను ఎలా రూపకల్పన చేయాలి, ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి అనేది ఇందులో పేర్కొన్నారు.
వివరాలు
మెట్రో మాదిరి డోర్ లాక్
ప్రస్తుతం కొన్నిసార్లు డోర్ పడక ముందే లిఫ్ట్‌లు కదలడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. మెట్రో రైలు విధానంలో ఉన్నట్లే, లిఫ్ట్ కదలే సమయంలో తలుపు తెరుచుకోకుండా నిరోధించే విధానం కొత్త కోడ్‌లో తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. అంటే తలుపు గట్టిగా మూసిన తర్వాతే లిఫ్ట్ ముందుకు లేదా వెనుకకు కదలాలి. ఇలాంటి నియంత్రణ ఇకపై అన్ని లిఫ్ట్‌లలో ఉండేటట్లు రూపొందించబడింది. లిఫ్ట్‌లు కొన్నిసార్లు ఎక్కువ వేగంతో పైకి వెళుతుండటం ప్రమాదాలకు దారి తీస్తోందని గుర్తించి, వాటిని నియంత్రించేందుకు స్పీడ్ గవర్నర్లను అమర్చటం తప్పనిసరి చేశారు. ఇవి లిఫ్ట్ అనవసరంగా అధిక వేగంతో ప్రయాణించకుండా నిరోధిస్తాయి.
వివరాలు
మెట్రో మాదిరి డోర్ లాక్
చాలా లిఫ్ట్‌ల్లో వీల్‌ఛైర్ పట్టడం లేదనే ఫిర్యాదులున్నాయి. ఇక నుంచి అవి పట్టే విధంగా (800ఎంఎం)లిఫ్ట్‌లుండాలి. విద్యుత్ అంతరాయాలు లేదా ఇతర సమస్యల సమయంలో ప్రయాణికులు, టెక్నీషియన్లు లిఫ్ట్‌లోకి సంప్రదించగల రెండు రకాల కమ్యూనికేషన్ వ్యవస్థలు సైట్‌లో ఉండాలని కోడ్ పేర్కొంటుంది. అలాగే 24 గంటల సేవా ప్రొవైడర్ లేదా బిల్డింగ్ గది (కంట్రోల్ రూమ్) కు కమ్యూనికేషన్లు అనుసంధానంగా ఉండాలి. అదనంగా, దృష్టి లోపం ఉన్న వ్యక్తుల కోసం ఆడియో హెచ్చరికలు/సూచనలు వినిపించే ఏర్పాట్లు ఉండాలి. ఎమర్జెన్సీ సమయంలో ఉపయోగించేందుకు కనీసం ఒక గంట పనిచేసే అత్యవసర వెలుగు ఏర్పాట్లు ఉండాలి. స్టాండ్ బై విద్యుత్తు వ్యవస్థలుండాలి.
వివరాలు
అన్ని రాష్ట్రాల్లో ఏకరీతిగా అమలు
ప్రస్తుతం ఒక్కో రాష్ట్రంలో లిఫ్ట్ సంబంధించిన చట్టాలు వేరుగా ఉండటంవల్ల అనేక అసమానతలు కనిపిస్తుంటాయి. తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల్లో చట్టాలు లేవు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సంబంధిత నిబంధనలు అమల్లో ఉన్నాయి. అయితే బీఐఎస్ కొత్త కోడ్ అమలైతే భవన యజమానులు, బిల్డర్లు, లిఫ్ట్ తయారీదారులు స్థానిక చట్టాలతో పాటు IS 17900 ప్రమాణాలను కూడా పాటించాల్సి రావడం ద్వారా అన్ని రాష్ట్రాల్లో లిఫ్ట్ తయారీ, ఇన్‌స్టాలేషన్ ప్రమాణాలు ఏకరీతిగా ఉండే అవకాశం ఉంది. ఈ పరిణామంతో ఎలివేటర్లపై జీఎస్‌టి తగ్గించాలని సంబంధిత సంఘాలు కూడా కోరుతున్నాయి.