New Scheme In Telangana: తెలంగాణలో సీఎం చేతుల మీదుగా కొత్త పథకం ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో 'తొలి ముద్ద' పేరుతో ప్రత్యేక బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ తదితరులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు ప్రతిరోజూ ఉదయం పౌష్టిక విలువలతో కూడిన అల్పాహారం అందించనున్నారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉప్మా, కిచిడీ మిక్స్ వంటి రుచికరమైన, పోషకాహారంతో కూడిన వంటకాలను అందించనున్నారు.
వివరాలు
అంగన్‌వాడీ వర్కర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ
అంగన్‌వాడీ కార్యకలాపాల్లో పారదర్శకత పెంచేందుకు, పర్యవేక్షణను సులభతరం చేయడానికి అంగన్‌వాడీ వర్కర్లకు ముఖ్యమంత్రి మొబైల్ ఫోన్లను కూడా పంపిణీ చేశారు. అదేవిధంగా, అంగన్‌వాడీ కేంద్రాలు ఇకపై అద్దె భవనాల్లో కొనసాగకుండా, వాటికి సొంత భవనాలు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి విద్య, నీటిపారుదల ఎంత ముఖ్యమో, భవిష్యత్ తరాల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని నొక్కి చెప్పారు. దేశంలో ఆహార భద్రత ఉన్నప్పటికీ, పోషకాహార భద్రత లోపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గర్భధారణ దశ నుంచే తల్లికి సరైన పోషకాహారం అందిస్తేనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.
వివరాలు
దేశానికి ఆదర్శంగా పథకం
ఆరేళ్లలోపు పిల్లలకు సరైన పౌష్టికాహారం అందకపోతే, అది వారి మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సీఎం తెలిపారు. అంగన్‌వాడీ టీచర్ల పాత్రపై ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను క్షేత్రస్థాయిలో విజయవంతం చేయాల్సింది వారేనని స్పష్టం చేశారు. అంగన్‌వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబ సభ్యుల్లా భావిస్తుందని, రాష్ట్రఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత వారి సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చిన్నారులను తమ సొంత పిల్లల్లా చూసుకోవాలని టీచర్లకు పిలుపునిచ్చారు.'తొలి ముద్ద' పథకం కేవలం పిల్లల ఆకలి తీర్చడమే కాకుండా.. తెలంగాణ భవిష్యత్ పౌరుల శారీరక, మానసిక వికాసానికి బలమైన పునాది వేయనుంది. పోషకాహార లోపాన్ని తగ్గించడంలో ఈ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.