Glass Skywalk Bridge : విశాఖలో కొత్త టూరిజం అట్రాక్షన్.. కైలాసగిరి వద్ద గ్లాస్ స్కైవాక్ వంతెన
విశాఖపట్టణం పర్యాటకంలో మరో స్పెషల్ అట్రాక్షన్‌కు నిలయంగా మారనుంది. కైలాసగిరి వద్ద ఉన్న టైటానిక్ వ్యూపాయింట్ సమీపంలో భారతదేశపు అతి పొడవైన గ్లాస్ స్కైవాక్ వంతెనను నిర్మిస్తున్నారు. రూ. 6 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఈ గ్లాస్ స్కైవాక్ 50 మీటర్ల మేర విస్తరించి ఉంటుంది. వంతెనపై ఒకేసారి 40 మంది వ్యక్తులు నడిచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వంతెనపై నిల్చుని ప్రకృతి సౌందర్యాన్ని తిలకించే వీలు ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు థ్రిల్లింగ్ జిప్ లైన్‌లు, స్కై సైక్లింగ్ ట్రాక్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో జిప్ లైన్ ట్రాక్ 150 మీటర్ల మేర విస్తరించి ఉంటుంది.
ఆలయాల దర్శనానికి ప్రత్యేక బస్సులు
ఈ గ్లాస్ వంతెనను విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టులో ఆర్జే అడ్వెంచర్స్, ఎస్ఎస్ఎమ్ షిప్పింగ్ లాజిస్టిక్స్, భారత్ మాతా వెంచర్స్ భాగస్వాములుగా ఉన్నారు. విశాఖపట్నం నుంచి ఐదు వైష్ణవ ఆలయాల దర్శనానికి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక సర్వీసులు విశాఖ ద్వారకా బస్టేషన్ నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరుతాయి. పంచ వైష్ణవ క్షేత్రాలుగా ద్వారకా తిరుమల, అంతర్వేది, అప్పనపల్లి, గొల్లలమామిడాడ, అన్నవరం ఆలయాలను దర్శించేందుకు అవకాశం కల్పిస్తాయి.