
Kulbhushan Jadhav: జాదవ్ కేసులో కొత్త మలుపు.. అప్పీల్ హక్కుపై పాక్ యూటర్న్
ఈ వార్తాకథనం ఏంటి
గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్ జైల్లో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ విషయంలో, అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ఇచ్చిన తీర్పులో ఉన్న ఒక చిన్న లొసుగును పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు తన అనుకూలంగా మలుచుకుంటోందని అర్థమవుతోంది.
2019 జూన్‌లో ఐసీజే జాదవ్‌కు కాన్సులర్ యాక్సెస్ కల్పించాలని తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అతడికి విధించిన మరణశిక్షను పునఃసమీక్షించాలని సూచించింది.
కానీ అప్పీల్ హక్కు విషయాన్ని స్పష్టంగా పేర్కొనకపోవడం పాక్‌కు అనుకూలంగా మారింది.
ఇటీవల పాకిస్తాన్ సుప్రీంకోర్టులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు నిరసనగా జరిగిన 2023 అల్లర్ల కేసు నేపథ్యంలో కొన్ని కీలక పాయింట్లు చర్చకు వచ్చాయి.
Details
ఐసీజే తీర్పు తర్వాత న్యాయవ్యవస్థలో మార్పులు
ఆ సమయంలో సైనిక కోర్టులు కొంతమందిని దోషులుగా నిర్ధారించగా, వారి తరఫు న్యాయవాదులు.. జాదవ్‌కు అప్పీల్ హక్కు ఇచ్చినప్పటికీ.. పాక్ పౌరులైన తమ ఖాతాదారులకు ఆ అవకాశం ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన పాకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ న్యాయవాది.. ఐసీజే తీర్పు తర్వాత తమ న్యాయవ్యవస్థలో మార్పులు చేసినట్లు తెలిపారు.
అయితే అది అప్పీల్ హక్కుకు సంబంధించి కాదని స్పష్టం చేశారు.
ఇక 2023 అల్లర్ల కేసుల్లో నిందితులుగా ఉన్నవారికి అప్పీల్ హక్కు కల్పించాలనే అంశంపై అటార్నీ జనరల్ మన్సూర్ ఉస్మాన్ అవాన్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.
దీనిపై నిర్ణయం తీసుకోవడానికి రెండు రోజులు గడువు కావాలని కోరినట్లు పేర్కొంది.
Details
కుల్‌భూషణ్ జాదవ్ కేసు నేపథ్యం
భారత నావికాదళం నుంచి పదవీ విరమణ చేసిన కుల్‌భూషణ్ జాదవ్ ఇరాన్‌లోని చాబహార్‌లో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సమయంలో 2016లో పాకిస్తాన్ ఏజెంట్లు ఆయన్ని అపహరించారని భారత ప్రభుత్వం ఆరోపిస్తోంది.
2017 ఏప్రిల్‌లో పాక్ మిలిటరీ కోర్టు ఆయనకు గూఢచర్యం ఆరోపణలపై మరణశిక్ష విధించింది. భారత ప్రభుత్వం ఈ తీర్పును తీవ్రంగా ఖండించింది.
జాదవ్‌ను ఇరాన్ నుంచి అక్రమంగా తీసుకెళ్లినట్లు ఆరోపించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ICJ2019లో జాదవ్‌కు కాన్సులర్ యాక్సెస్ కల్పించాలని తీర్పు ఇచ్చింది.
ఇప్పుడు మాత్రం, అప్పీల్ హక్కు అంశాన్ని స్పష్టంగా పొందుపరచకపోవడం వల్ల.. పాకిస్తాన్ తాజాగా దీనిని తన అనుకూలంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తోంది.
ఇది జాదవ్ కేసులో మరో కొత్త మలుపు తెచ్చే అవకాశముంది.