LOADING...
HIV: హెచ్ఐవీపై కొత్త ఆయుధం.. లెనకపవిర్‌కు ఈయూ ఆమోదం!
హెచ్ఐవీపై కొత్త ఆయుధం.. లెనకపవిర్‌కు ఈయూ ఆమోదం!

HIV: హెచ్ఐవీపై కొత్త ఆయుధం.. లెనకపవిర్‌కు ఈయూ ఆమోదం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 26, 2025
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు రూపొందించిన సూదిమందు లెనకపవిర్‌కు యూరోపియన్ యూనియన్‌కు చెందిన మెడిసిన్స్ ఏజెన్సీ (EMA) ఆమోదం మంజూరు చేసింది. ఈ సూది మందు ఏడాదిలో రెండు సార్లు తీసుకుంటే చాలని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇది హెచ్‌ఐవీ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. యూరప్‌ దేశాల్లో ఈ ఔషధాన్ని 'యెయ్‌టువో' అనే బ్రాండ్ పేరుతో గిలియడ్ సైన్సెస్ మార్కెట్‌లోకి తెస్తోంది. ఈ దశలో యూరోపియన్ యూనియన్‌కు చెందిన 27 దేశాలతో పాటు ఐస్‌ల్యాండ్, నార్వే, లీచెన్‌స్టెయిన్ దేశాల్లోనూ లెనకపవిర్ అందుబాటులోకి రానుంది.

Details

100శాతం ప్రభావవంతంగా పనిచేసే అవకాశం

గతేడాది నిర్వహించిన ఓ ప్రముఖ అధ్యయనంలో లెనకపవిర్‌ను పురుషులు, మహిళలకు వినియోగించగా 100 శాతం ప్రభావవంతంగా పనిచేసిందని తేలింది. దీంతో హెచ్‌ఐవీ వ్యాప్తిని నియంత్రించడంలో ఇది కీలక మలుపుగా మారబోతుందని ఐరాస ఎయిడ్స్‌ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ తెలిపారు. ఇంతకుముందే 2024 జూన్‌లో అమెరికా ప్రభుత్వ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఈ మందుకు ఆమోదం ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా హెచ్‌ఐవీ నివారణలో లెనకపవిర్ ప్రభావాన్ని ప్రశంసించింది. ఈ సూది మందును ఒకసారి తీసుకుంటే ఆరు నెలలపాటు వైరస్‌కు పనిచేస్తుందట.

Details

4 కోట్ల మంది బాధితులు ఉన్నట్లు సమాచారం

ప్రత్యేకంగా, హెచ్‌ఐవీ కేసులు అధికంగా ఉన్న ఆఫ్రికా, ఆసియా, కరీబియన్ ప్రాంతాల్లోని 120 పేద దేశాలకు ఈ ఔషధాన్ని తక్కువ ధరకు అందజేస్తామని గిలియడ్ సైన్సెస్ సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నట్లు అంచనా. కేవలం 2024లోనే దాదాపు 6.30 లక్షల మంది హెచ్‌ఐవీ వల్ల మృతి చెందారని గణాంకాలు చెబుతున్నాయి.