
Ground Water: రాష్ట్రంలో 30 ఏళ్లలో మూడు రెట్లు పెరిగిన భూగర్భజలాల వినియోగం: ఎన్‌జీఆర్‌ఐ
ఈ వార్తాకథనం ఏంటి
వాతావరణమార్పులు,రుతుపవనాల గమనంలో వచ్చిన మార్పుల కారణంగా ఉపరితల,భూగర్భ జలాల స్థితిగతులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తగినన్నివర్షాలు పడకపోవడం వల్ల భూమిలోకి నీరు ఇంకకపోతుండగా,మరోవైపు మరింత ఎక్కువగా భూగర్భ జలాలను తోడేస్తున్నారు. ముఖ్యంగా వాననీరు నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండే తెలంగాణ రాతి భూభాగాల్లో భూగర్భ జలాలపై ఒత్తిడి మరింత పెరుగుతున్నదని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ)శాస్త్రవేత్తలు తెలిపారు. రాష్ట్రంలో భాగంగా పాక్షిక శుష్క వాతావరణ పరిస్థితులు ఉండే రాతి నేలల ప్రాంతాల్లో వారు అధ్యయనం చేపట్టారు. ప్రాథమికంగా 85శాతం భూగర్భ జలాలపైనే ఆధారపడే ఈ ప్రాంతాల్లో 2002నుండి 2020మధ్య కాలంలో చెరువులు,నదులు వంటి ఉపరితల నీటి నిల్వలతో పాటు భూగర్భ జలాల నిల్వల గమనాన్ని విశ్లేషించగా,ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వివరాలు
వరికి ఏటా 15 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి అవసరం..
తెలంగాణలో సగటున ప్రతి సంవత్సరం 110బిలియన్ క్యూబిక్ మీటర్ల వర్షపాతం నమోదు అవుతుంది. ఒక క్యూబిక్ మీటరు అంటే సుమారు 5వేల లీటర్ల నీరు.అయితే,ఇందులో కేవలం 15శాతం మాత్రమే భూమిలోకి ఇంకుతోందని పరిశోధకులు గుర్తించారు. వర్షపాతం తక్కువగా ఉండే ఏళ్లలో భూగర్భ జలాల స్థాయిపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు పేర్కొన్నారు. వర్షపాతం 10-20శాతం తక్కువగా నమోదైతే భూమిలోకి ఇంకే నీటి పరిమాణం ఏకంగా 25-50శాతం వరకు తగ్గిపోతుందని అధ్యయనంలో వెల్లడైంది. వర్షం కురిసిన తర్వాత భూమిలోని లోతైన పొరల వరకు ఆ నీరు చేరేందుకు 1-2నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు. ఇందుకు ఉపగ్రహాల ద్వారా సేకరించిన డేటాను ఉపయోగించి 'గ్రావిటీ రికవరీ అండ్ క్లైమెట్ ఎక్స్‌పెరిమెంట్ (గ్రేస్)' అనే పద్ధతిని వినియోగించారు.
వివరాలు
భవిష్యత్‌లో ఎండలు-వానలు అధికంగా ఉండే సూచనలు..
భూగర్భజలాల స్థాయి, ఉపరితల నీటి నిల్వల మార్పులను గ్రేస్ పద్ధతిలో అంచనా వేశారు. తెలంగాణలో వచ్చే కాలంలో వర్షపాతం 15-50 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వాతావరణ మార్పుల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. 2100 నాటికి ఉష్ణోగ్రతలు 0.3 డిగ్రీల నుండి 2.93 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో వెల్లడించారు.
వివరాలు
నీటి భద్రత కోసం తక్షణ చర్యలు అవసరం..
వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని నీటి భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు. గత 30 ఏళ్ల కాలంలో తెలంగాణలో సాగు కోసం భూగర్భ జలాల వినియోగం మూడు రెట్లు పెరిగిందని, ముఖ్యంగా వరి పంట సాగు అధికంగా ఉండటం వల్ల ప్రతి ఏడాది సుమారు 15 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని వరి పంటకే వినియోగిస్తున్నారని వివరించారు. తగిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలో సగానికి పైగా వ్యవసాయంపై ఆధారపడే ప్రజలు భవిష్యత్తులో నీటి కొరత కారణంగా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
వివరాలు
వ్యవసాయదారుల్లో నీటి వినియోగంపై అవగాహన
దీర్ఘకాలిక దృష్టితో భూగర్భ జలాల నిల్వలను నిలబెట్టుకోవాలంటే వరి సాగును తగ్గించాల్సి ఉంటుందని, ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయదారుల్లో నీటి వినియోగంపై అవగాహన పెంచడం ద్వారా భూగర్భ జలాల వినియోగాన్ని నియంత్రించవచ్చని వివరించారు. పరిశోధనలో పాల్గొన్న ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్త డాక్టర్ అభిలాష్ కుమార్ పాసవాన్ ఈ విషయాలను వెల్లడించారు. ఆయనతో పాటు నరకుల శ్రీనివాసరావు, ఎల్. రఘు, వీరేంద్ర మని తివారీ కలిసి చేపట్టిన ఈ పరిశోధన పత్రం ఇటీవల యూరోపియన్ అసోసియేషన్ ఆఫ్ జియోసైంటిస్ట్స్ అండ్ ఇంజినీర్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.