Highway build feat: బెంగళూరు-విజయవాడ హైవే నిర్మాణంలో గిన్నిస్ రికార్డులు
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరు-విజయవాడను కడప ద్వారా కలుపుతున్న జాతీయ రహదారి నిర్మాణంలో రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ సంస్థ విప్లవాత్మక కార్యాన్ని ప్రదర్శిస్తూ నాలుగు గిన్నిస్ రికార్డులు సృష్టించింది. ఈ ప్రయత్నాలు ఈ నెల 5న శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం సాతర్లపల్లి వద్ద ప్రారంభించింది. ఈ నెల 6న బొంతలపల్లి సమీపంలో, 28.89 లేన్ కిలోమీటర్ల పొడవైన రహదారిని 24 గంటల్లో పూర్తి చేయడం ద్వారా సంస్థ మొదటి రికార్డును నెలకొల్పింది. అలాగే, అదే 24 గంటల్లో అత్యధికంగా 10,655 టన్నుల బిటుమినస్ కాంక్రీటు నిరంతరంగా వేసి రెండో రికార్డును కూడా సాధించింది. ఈ నెల 11 వరకు 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ను నిరంతరంగా వేసి మూడో రికార్డును సాధించింది.
వివరాలు
రికార్డు నెలకొల్పడంపై నితిన్ గడ్కరీ, చంద్రబాబు ప్రశంసలు
అలాగే, మొత్తం 156 లేన్ కిలోమీటర్ల (26 కిలోమీటర్ల పొడవు, 6 వరుసలుగా) రహదారిని నిరంతరంగా నిర్మించడం ద్వారా నాలుగో రికార్డును కూడా సాధించింది. సోమవారం ఈ ఘనతను వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గిన్నిస్ ధ్రువీకరణ పత్రాల రూపంలో అధికారికంగా అందజేయనున్నారు. ఈ రికార్డు నెలకొల్పడాన్ని నితిన్ గడ్కరీ, చంద్రబాబు వేర్వేరుగా ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత్వంలో సాధించిన ఈ విజయాలు ప్రపంచ స్థాయి హైవే మౌలిక వసతుల ఏర్పాటులో, భారీ ప్రాజెక్టుల అమలులో మన సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయని గడ్కరీ తెలిపారు. అలాగే, చంద్రబాబు ఈ రికార్డుల స్ఫూర్తితో కారిడార్ మిగిలిన పనులను త్వరగా పూర్తిచేయాలని ఆకాంక్షించారు.