LOADING...
Nirmala Sitharaman: ఆస్ట్రో ఫిజిక్స్‌ కేంద్రంగా అమరావతి అవతరిస్తుంది: నిర్మలా సీతారామన్‌ 
ఆస్ట్రో ఫిజిక్స్‌ కేంద్రంగా అమరావతి అవతరిస్తుంది: నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman: ఆస్ట్రో ఫిజిక్స్‌ కేంద్రంగా అమరావతి అవతరిస్తుంది: నిర్మలా సీతారామన్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2025
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమవడం సంతోషకరమైనదని, ఇది ఒక విధమైన యజ్ఞం లాంటిదని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దేశంలో కొత్త రాజధానిని నిర్మించడం సాధారణ విషయం కాదని, ఈ భారీ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి మద్దతు అందిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె అమరావతిలో 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించారు.

వివరాలు 

రైతుల త్యాగాన్ని మరువొద్దని, వారికి బ్యాంకులు అండగా నిలవాలని పిలుపు 

భవిష్యత్ రాజధానికి ఆర్ధిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు (PSUలు) తమ ప్రధాన కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఒకే ప్రాంతంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 15 బ్యాంకులు, బీమా సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించడం ప్రత్యేకమైన ఘట్టమని ఆమె అభినందించారు. రాజధాని నిర్మాణానికి భూములను త్యాగం చేసిన రైతులను ఎప్పటికీ మర్చిపోకూడదని, వారి హక్కులను కాపాడడం బ్యాంకుల బాధ్యత అని గుర్తుచేశారు. బ్యాంకులు కేవలం కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు అందించడం మాత్రమే కాకుండా, రైతుల ఉత్పత్తుల మార్కెటింగ్,ప్యాకింగ్,కోల్డ్ చెయిన్ వంటి సౌకర్యాలు కల్పించే పరిశ్రమలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రత్యేకంగా రాయలసీమలోని 9 జిల్లాల ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల మార్కెట్లకు తరలించడంలో బ్యాంకులు సహకరించాలన్నారు.

వివరాలు 

ఏపీకి ప్రధాని మోదీ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం 

గత పదేళ్లలో దేశంలో 25 కోట్ల మంది దారిద్ర్యరేఖ నుంచి బయటకు వచ్చారని, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు కూడా పెరుగుతున్నాయని నిర్మల చెప్పారు. ఈ మార్పులకు అనుగుణంగా, బ్యాంకులు భవిష్యత్ ఆలోచనలతో, సమగ్ర విధానాలతో పనిచేయాలని ఆమె సూచించారు. గతంలో 'మహిళా సఖి' కార్యక్రమం మహిళలను బీమా ఏజెంట్లుగా మార్చి అద్భుత ఫలితాలను సాధించిందని గుర్తు చేశారు. విభజన తర్వాత అనేక సమస్యలు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలా మద్దతుగా నిలవాలని ప్రధాని మోదీ ఎల్లప్పుడూ చెబుతూ వచ్చారని, ఏపీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయన వెంటనే ఆమోదం తెలుపుతారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్‌ దృష్ట్యా, క్వాంటం వ్యాలీ, ఏఐ ప్రాజెక్టుల కోసం జిల్లాల్లో ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

రాష్ట్రంలో ఏఐ, క్వాంటం వ్యాలీ, ఆస్ట్రో ఫిజిక్స్ ప్రాజెక్టులకు కేంద్రం మద్దతు 

కేవలం ఐటీ మాత్రమే కాదు, ఆస్ట్రో ఫిజిక్స్ వంటి రంగాల్లోనూ ఏపీని ముందుకు తీసుకెళ్తున్నామని, ఇందులో భాగంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం సంతోషకరమని చెప్పారు. ఆచార్య నాగార్జునుడు వంటి గొప్ప శాస్త్రవేత్తలు నడయాడిన ఈ భూభాగంలో అమరావతిలో కాస్మోస్ ప్లానెటోరియం నిర్మించడం హర్షణీయమని అన్నారు. రాబోయే ఏడాదిన్నరలో ఆంధ్రప్రదేశ్ ఒక ఫ్యూచరిస్టిక్ రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రేర్ ఎర్త్ మినరల్స్‌పై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు, ఈ రంగంలో అవకాశాలను అందుకోవడానికి ఏపీ కూడా సక్రమంగా కృషి చేయాలని నిర్మలా సీతారామన్ సూచించారు.

Advertisement