Nithari Killings : జైలు నుంచి విడుదలైన మణిందర్ సింద్ పంధేర్.. నిఠారి వరుస హత్యల కేసులో విముక్తి
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు మేరకు నిఠారి వరుస హత్యల కేసులో ప్రధాన నిందితుడు ఇవాళ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. హత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న మణిందర్ సింగ్ పంధేర్ గ్రేటర్ నోయిడా కారాగారం నుంచి విడుదలయ్యాడు. 2006 నాటి నిఠారి వరుస హత్య,అత్యాచారం కేసుల్లో పనిమనిషి సురేంద్ర కోలీతో పాటు నిందితుడిగా ఉన్న మణిందర్ కు అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం విముక్తి కల్పించింది.ఈ క్రమంలోనే వారికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని తేల్చేసింది. నోయిడాలోని ఓ బంగ్లా వెనుక 8 మంది చిన్నారుల ఎముకలు కనిపించడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఇద్దరూ కలిసి పలువురు బాలికలపై లైంగికదాడికి, దారుణ హత్యలకు పాల్పడ్డారని, నరమాంస భక్షకులని సంచలన ఆరోపణలు చెలరేగాయి.
గతంలో ఉరిశిక్ష విధించిన ఘజియాబాద్ సీబీఐ కోర్టు
అత్యాచారం, హత్య నేరాలకు పాల్పడిన వీరిద్దరికీ ఘజియాబాద్‌లోని సీబీఐ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీన్ని సవాల్ చేసిన పంధేర్, కోలీల పిటిషన్‌ను జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్‌హెచ్‌ఏ రిజ్విల ద్విసభ్య ధర్మాసనం గత సోమవారం విచారించింది. ఎలాంటి అనుమానాలకు అవకాశం లేకుండా వీరిద్దరికీ వ్యతిరేకంగా మర్డర్, రేప్ కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని ధర్మాసనం వెల్లడించింది. ఈ క్రమంలోనే నేడు శుక్రవారం మణిందర్ సింగ్ రిలీజ్ అయ్యాడు. మరోవైపు ఈ కేసులో నిర్థోషిగా బయటపడ్డ పనిమనిషి కోలి, మరో కేసులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు. 2007లో పంధేర్, కోలీలపై 19 కేసులు నమోదయ్యాయి. అవసరమైన సాక్ష్యాలు దొరకలేదంటూ మూడు కేసుల్లో మాత్రమే సీబీఐ అభియోగ పత్రాలను నమోదు చేసింది.