ప్రపంచ దేశాధినేతలకు కనీవినీ ఎరుగని రీతిలో ఆతిథ్యం.. మమతా, నితీశ్ హాజరయ్యే అవకాశం
G- 20 సదస్సుకు సర్వం ముస్తాబైంది. విదేశీ అతిథులకు అద్భుతమైన ఆతిధ్యం ఇచ్చేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం విందు ఏర్పాటు చేశారు. ఈ మేరకు మాజీ ప్రధాన మంత్రులు మన్మోహన్ సింగ్, హెచ్ డీ దేవగౌడలకు కేంద్రం ఆహ్వానాలు పంపించింది. ప్రతిపక్ష కూటమి నేతలు బీహార్ సీఎం నితీశ్ కుమార్,బెంగాల్ సీఎం మమతా బెనర్జీలకు ఇప్పటికే ఆహ్వానం అందగా, వారు హాజరవనున్నట్లు సమాచారం. ఈ విందులోనే G-20 సదస్సుకు దిల్లీ వచ్చే దేశాధినేతల సతీమణులు,కుటుంబీకులకు అద్వితీయమైన అనుభూతిని కలిగించేందుకు కేంద్రం ఏర్పాట్లు పూర్తి చేసింది. జీ-20 సదస్సుకు భారత్ నాయకత్వం వహించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో కేంద్రం వైఖరిని మెచ్చుకున్నారు.
అతిథులను మైమరపించే అరుదైన సంగీత కచేరీ
భారతీయ శాస్త్రీయ సంగీతంలోని మాధుర్యాన్ని ప్రపంచ దేశాల అతిథులకు తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ సంగీత రూపకాలను ప్రదర్శించనున్నారు. గంటన్నర పాటు సాగే వాద్య దర్శన్ కోసం వైవిధ్యమైన వాద్య పరికరాలను ఉపయోగించనున్నారు. అతి అరుదుగా కనిపించే సుర్‌బహార్, జల్‌తరంగ్, నల్‌తరంగ్, విచిత్ర వీణ, రుద్ర వీణ, సరస్వతి వీణ, ధాంగ్లీ, సుంద్రీ, భాపాంగ్, దిల్‌రుబా వంటి సంగీత పరికరాలతో మైమరపించనున్నారు. 34 హిందుస్తానీ వాద్య పరికరాలు, 18 కర్ణాటక సంగీత పరికరాలు, 26 జానపద సంగీత పరికరాలను ప్రదర్శించనున్నారు. ఇందులో 11 మంది చిన్నారులు, దివ్యాంగులు సహా మొత్తం 78 మంది కళాకారులు కచేరీలో భాగం కానున్నారు.