Bihar: విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం.. ఎన్డీఏకు అనుకూలంగా 129 ఓట్లు
బిహార్ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం సాధించారు. 129 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. నితీష్ కుమార్, ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా అనుకూలంగా 129 ఓట్లు పోలయ్యాయి. దీంతో నితీష్ ప్రభుత్వం బలపరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. అనంతరం కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలోని విపక్ష ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు స్పీకర్ అవధ్ బిహారీ చౌదరిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానానికి అనుకూలంగా 125 మంది సభ్యులు, వ్యతిరేకంగా 112 మంది సభ్యులు ఓటు వేశారు. దీంతో స్పీకర్ పదవి నుంచి అవధ్ బిహారీ చౌదరి వైదొలిగారు.
ఆర్జేడీ ప్లాన్ ప్లాఫ్
అయితే నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్షాలు కూడా వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. 8 మంది ఎన్డీయే ఎమ్మెల్యేలను తమ వెంట తీసుకెళ్లి నితీష్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆర్జేడీ పథకం పన్నింది. అందులో జేడీయూ నుంచి ఐదుగురు, బీజేపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ విషయం ఎన్‌డీఏ వర్గాలకు తెలియడంతో నితీష్ కుమార్ అప్రమత్తమయ్యారు. ప్రభుత్వాన్ని కాపాడే ఆపరేషన్‌ను మొదలు పెట్టారు. ఒవైపు తమ వర్గం ఎమ్మెల్యేలను కాపాడుకుంటూనే, మరోవైపు ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలను నితీష్ కుమార్ తమవైపు తిప్పుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను సభకు గైర్హాజరు చేయడం ద్వారా ముందుగా స్పీకర్ అవద్ బిహారీ చౌదరి కుర్చీని కాపాడుకోవాలని ఆర్‌జేడీ ప్లాన్ చేసింది. కానీ అది సాధ్యం కాలేదు.