Arvind Kejriwal: పొత్తు లేదు, ఒంటరిగా పోటీ చేస్తాం : కేజ్రీవాల్ కీలక ప్రకటన
వచ్చే ఏడాది దిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా కూటమితో సంబంధం లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తుల దారి పట్టదని, తాము ఒంటరిగా పోరాటానికి సిద్ధమని ఆయన విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఈ ప్రకటనతో ప్రతిపక్షాల ఇండియా కూటమికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇదే విధంగా లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా పంజాబ్‌లో కాంగ్రెస్‌తో పొత్తును తిరస్కరించి, 13 స్థానాల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.
వీలైతే గ్యాంగ్‌స్టర్లను అరెస్టు చేయాలి
ఈ పరిణామాల నడుమ కాంగ్రెస్ కూడా దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి పొత్తు లేకుండా పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించింది. ఇరు పార్టీలు ఈ మార్గాన్ని ఎంచుకోవడం రాజకీయంగా ఉత్కంఠను పెంచుతోంది. దిల్లీ దక్షిణ ప్రాంతంలోని మాలవీయ నగర్‌లో కేజ్రీవాల్ నిర్వహించిన పాదయాత్రలో అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఆయనపై ద్రావకం విసరడానికి ప్రయత్నించగా, భద్రతా సిబ్బంది స్పందించి ప్రమాదాన్ని నివారించారు. ఈ ఘటనపై కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. తాను చేసిన తప్పు ఏమిటి అని పేర్కొన్నారు. కేంద్రమంత్రి అమిత్ షా దీనిపై చర్యలు తీసుకుంటారని ఆశించాను. కానీ దానికి బదులుగా తనపైనే దాడి జరిగిందన్నారు. కేంద్రానికి వీలైతే గ్యాంగ్‌స్టర్లను అరెస్టు చేయించాలని, తమల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని ప్రశ్నించారు.