Kodi Kathi Case: కోడి కత్తి కేసులో కుట్రకోణం లేదు: హైకోర్టులో ఎన్ఐఏ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన కోడి కత్తి దాడి కేసు(Kodi Kathi Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై ఏపీ హైకోర్టులో జరిగిన విచారణలో ఎన్ఐఏ కీలక వ్యాఖ్యలు చేసింది. కోడి కత్తి కేసుపై లోతైన దర్యాప్తు జరపాలని వైఎస్ జగన్ హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై విచారణ జరగ్గా.. ఎన్ఐఏ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. కోడి కత్తి కేసు(Kodi Kathi Case)లో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ స్పష్టం చేసింది. ఈ దాడిలో నిందితుడు శ్రీనివాసరావు తప్ప మరొక వ్యక్తి పాత్ర లేదని పేర్కొంది. ఎన్‌ఐఏ కోర్టు ఉత్తర్వులపై ఇద్దరు జడ్జిలతో కూడిన ధర్మాసనం మాత్రమే విచారించాలని విజ్ఞప్తి చేసింది.
జగన్ పిటిషన్‌ను కొట్టివేయాలి: ఎన్ఐఏ
ఈ కేసులో అన్ని కోణాల్లో, అన్ని అంశాలను దర్యాప్తు చేశామని, ఎక్కడా కుట్ర కోణం కనిపించలేదని ఎన్ఐఏ పేర్కొంది. ఈ నేపథ్యంలో జగన్ పిటిషన్‌ను కొట్టేయాలని ధర్మాసనాన్ని ఎన్ఐఏ కోరింది. అలాగే, దర్యాప్తు అభ్యర్థనను నిరాకరిస్తూ ఎన్‌ఐఏ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు ఇచ్చిన స్టేను సైతం ఎత్తివేయాలని ఎన్ఐఏ విజ్ఞప్తి చేసింది. కోడి కత్తి కేసులో లోతైన దర్యాప్తు చేయాలంటూ, ఈ ఏడాది జూన్ 25న సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్ఐఏ కోర్టు కొట్టివేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఎం వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు.