బీజేపీతో పొత్తు లేదు, ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటాం: అన్నాడీఎంకే
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే కూటమిపై నీలినీడలు కమ్ముకున్నాయి. సార్వత్రిక ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య దూరం పెరుగుతోంది. బీజేపీతో పొత్తు లేదని, ఎన్నికల సమయంలో పొత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటామని అన్నాడీఎంకే సోమవారం సోమవారం ప్రకటించడం బీజేపీ-అన్నాడీఎంకే మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఏఐడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ గురువు, దివంగత సీఎన్ అన్నాదురైపై రాష్ట్ర బీజేపీ చీఫ్ కె.అన్నామలై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై అనర్హుడని అన్నాడీఎంకే నేత డి.జయకుమార్ స్పష్టం చేశారు. తనను తాను ప్రొజెక్ట్ చేసుకునేందుకే అతను దివంగత నేతలపై హీనంగా మాట్లాడుతున్నారని జయకుమార్ అన్నారు.
అన్నామలైను అదుపులోకి పెట్టుకోవాలి: అన్నాడీఎంకే
అన్నాడీఎంకే ఐకాన్ జయలలితపై అన్నామలై చేసిన వ్యాఖ్యలపై కూడా జయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ చీఫ్‌ను అదుపులో పెట్టాలని కోరారు. జయలలితను అవమానిస్తే తమ పార్టీ కార్యకర్తలు సహించరని అన్నారు. బీజేపీకి రాష్ట్రంలో అవకాశాలు చాలా తక్కువని, తమ వల్లే తమిళనాడులో కాషాయ పార్టీకి వెలుగులోకి వచ్చిందన్నారు. సెప్టెంబరు 11న 'సనాతన ధర్మ' నిర్మూలన సదస్సులో పాల్గొన్న ధర్మాదాయ శాఖ మంత్రి పికె శేఖర్‌బాబుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నాదురైపై అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. 1950లలో మదురైలో జరిగిన ఒక కార్యక్రమంలో హిందుత్వానికి వ్యతిరేకంగా అన్నాదురై విమర్శలు చేశారని, దాన్ని స్వాతంత్ర్య సమరయోధుడు పసుంపొన్ ముత్తురామలింగ తేవర్ తీవ్రంగా వ్యతిరేకించారని అన్నామలై గుర్తు చేసారు.