Gangotri : గంగోత్రిలో అన్యమతస్థులకు నో ఎంట్రీ.. అదే బాటలో బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రాల పౌరాణిక వైభవం, సనాతన ధర్మ సంప్రదాయాలను కాపాడే దిశగా అక్కడి ఆలయ కమిటీలు కీలకమైన, సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. 'దేవభూమి'గా పేరొందిన ఈ ప్రాంతంలోని ప్రముఖ ఆలయాల్లోకి అన్యమతస్థుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించాలనే దిశగా చర్యలు చేపడుతున్నారు. గంగోత్రి ధామ్‌లో కఠిన ఆంక్షలు గంగోత్రి ఆలయ కమిటీ ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఒక కీలక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. గంగోత్రి ధామ్‌లోకి అన్యమతస్థుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు సురేష్ సెమ్వాల్ స్పష్టం చేశారు. ఈ నిబంధనలు గంగోత్రి ధామ్‌కే పరిమితం కాకుండా, శీతాకాలంలో గంగామాత కొలువై ఉండే ముఖ్బా ప్రాంతానికి కూడా వర్తిస్తాయని ఆయన తెలిపారు.
Details
బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయాల్లోనూ అదే దారి
శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) కూడా ఇదే బాటలో నడవాలని నిర్ణయించింది. తమ పరిధిలోకి వచ్చే 45 ఆలయాల్లోకి అన్యమతస్థుల ప్రవేశాన్ని నిషేధించేందుకు కమిటీ సిద్ధమవుతోంది. ఈ అంశంపై రానున్న బోర్డు సమావేశంలో అధికారిక ప్రతిపాదనను ప్రవేశపెట్టనున్నట్లు BKTC అధ్యక్షుడు హేమంత్ ద్వివేది వెల్లడించారు. 'దేవభూమి ఉత్తరాఖండ్ మతపరమైన, సాంస్కృతిక సంప్రదాయాలను కాపాడటం మా ప్రధాన లక్ష్యం. గతంలో బీజేపీయేతర ప్రభుత్వాల హయాంలో ఈ పురాతన సంప్రదాయాలు ఉల్లంఘనకు గురయ్యాయి. పవిత్ర క్షేత్రాల పవిత్రతను రక్షించేందుకు, శతాబ్దాల నాటి ఆచారాలను పకడ్బందీగా అమలు చేయడానికి ఇప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని హేమంత్ ద్వివేది పేర్కొన్నారు.
Details
హరిద్వార్ 'హర్ కీ పౌడీ' వద్ద హెచ్చరిక బోర్డులు
ఇదిలా ఉండగా, హరిద్వార్‌లోని ప్రసిద్ధ గంగా ఘాట్ 'హర్ కీ పౌడీ' వద్ద 'అన్యమతస్థులకు ప్రవేశం లేదు' అనే బోర్డులు దర్శనమిచ్చాయి. గంగా సభ ఆధ్వర్యంలో ఈ బోర్డులను ఘాట్‌కు వెళ్లే మార్గాల్లో, వంతెనల పిల్లర్లపై ఏర్పాటు చేశారు. 1916 నాటి హరిద్వార్ మున్సిపల్ చట్టం ప్రకారం హర్ కీ పౌడీ ప్రధాన ఘాట్‌లోకి అన్యమతస్థుల ప్రవేశంపై అప్పటికే నిషేధం ఉందని గంగా సభ అధ్యక్షుడు నితిన్ గౌతమ్ గుర్తు చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ బోర్డులు ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ నందన్ కుమార్ కూడా ధృవీకరించారు
Details
వైరల్ వీడియోతో మొదలైన చర్చ
ఈ నిర్ణయాలకు నేపథ్యంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం అరబ్ దేశస్తుల సంప్రదాయ వేషధారణ (కందూరా) ధరించిన ఇద్దరు యువకులు హర్ కీ పౌడీ పరిసరాల్లో తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో భక్తుల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే పోలీసుల విచారణలో ఆ ఇద్దరూ హిందువులేనని, తమ యూట్యూబ్ ఛానెల్ కోసం వీడియో షూట్ చేయడానికి అలా వేషధారణ మార్చారని తేలింది. ఈ ఘటన తర్వాత, వచ్చే ఏడాది జరగనున్న అర్ధకుంభమేళా నాటికి హరిద్వార్‌లోని అన్ని ఘాట్లు, ఆలయాల్లో అన్యమతస్థుల ప్రవేశంపై శాశ్వత నిషేధం విధించాలని గంగా సభ డిమాండ్ చేస్తోంది. దీనిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Details
విపక్షాల విమర్శలు
ఈ పరిణామాలపై విపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమేనని ఆరోపించింది. 'సాధారణంగా అన్యమతస్థులు ఈ ఆలయాల్లోకి రారు. అలాంటప్పుడు ఇలాంటి అధికారిక నిషేధాల అవసరం ఏముంది? రాష్ట్రంలోని అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యకాంత్ ధస్మాన విమర్శించారు.