Google: మారుమూల కాలేజీ నుంచి గూగుల్ వరకు… టైర్-3 విద్యార్థినీ సక్సెస్ స్టోరీ వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
మారుమూల ప్రాంతంలోని టైర్-3 కళాశాలలో అనేక అడ్డంకుల మధ్య చదువు పూర్తి చేసి, చివరికి ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్‌లో ఉద్యోగం సాధించిన తన ప్రయాణాన్ని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన ఆర్చీ గుప్తా ఇన్‌స్టాగ్రామ్‌లో తన కెరీర్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ, సాధారణ కాలేజీలో చదువుకున్న తనకు ఎదురైన సవాళ్లు, నిరాకరణలను వివరించింది. మనం పుట్టిన ప్రదేశం లేదా పెరిగిన పరిస్థితులు మన ఎదుగుదలను అడ్డుకోలేవని ఆమె స్పష్టం చేసింది. కఠిన పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకుండా ప్రయత్నిస్తే విజయాన్ని అందుకోవచ్చని తెలిపింది.
వివరాలు
సాధారణ టెక్ సంస్థలో ప్లేస్‌మెంట్
భోపాల్ సమీపంలోని మారుమూల ప్రాంతంలో ఉన్న టైర్-3 కళాశాలలో ఆర్చీ గుప్తా 2017లో డిగ్రీ పూర్తి చేసింది. చిన్న కాలేజీ కావడంతో అక్కడ సాధారణ టెక్ సంస్థలే ప్లేస్‌మెంట్లు నిర్వహించాయి. గూగుల్‌లో ఉద్యోగం చేయాలన్నది తన కల అయినప్పటికీ, మొదటగా ఆమె ఓ చిన్న కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అక్కడ ప్రోగ్రామింగ్, కోడింగ్ వంటి సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. అనంతరం మరో టెక్ సంస్థలో ఇంటర్న్‌షిప్ చేస్తూ అనుభవాన్ని సంపాదించింది. ఈ క్రమంలో 2019లో గూగుల్ ఇంటర్వ్యూకు హాజరై నిరాకరణకు గురైంది. అయితే ఆ అనుభవంతో నిరుత్సాహపడకుండా, తన నైపుణ్యాలపై మరింత దృష్టి పెట్టింది.
వివరాలు
స్పష్టమైన లక్ష్యంతో పట్టుదలగా ముందుకు సాగితే..
ఎన్నో ప్రయత్నాల తర్వాత 2022లో గూగుల్ నుంచి ఉద్యోగానికి ఎంపికైనట్లు మెయిల్ రావడంతో, అప్పటి వరకు ఎదురైన కష్టాలన్నీ మర్చిపోయానని ఆర్చీ గుప్తా తెలిపింది. వృత్తి జీవితంలో ఎదురయ్యే సమస్యలను అడ్డంకులుగా కాకుండా, వాటిని అధిగమించే అవకాశాలుగా తీసుకోవాలని ఆమె యువతకు సూచించింది. ప్రముఖ కాలేజీలు లేదా ఐఐటీల్లో చదవకపోయినా, స్పష్టమైన లక్ష్యంతో పట్టుదలగా ముందుకు సాగితే విజయం తప్పకుండా సాధ్యమని పేర్కొంది. ఈ పోస్టు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ కావడంతో నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.