India: పాక్ ఎన్ని ఆరోపణలు చేసినా.. జమ్మూకశ్మీర్ భారత్‌దే: ఐరాసలో భారత్ స్పష్టం
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ వేదికలపై పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ పాకిస్థాన్ భారత్‌పై తన వైఖరిని మార్చుకోవడం లేదని మరోసారి స్పష్టమైంది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్థాన్‌కు భారతదేశం ఘాటుగా సమాధానం ఇచ్చింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో పదేపదే జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వార్షిక నివేదికపై సాధారణ సభలో జరిగిన చర్చ సందర్భంగా పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పార్వతనేని హరీష్ తీవ్రస్థాయిలో స్పందించారు.
వివరాలు
పాకిస్థాన్ తన వైఖరిని మార్చుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
భారత్ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్థాన్ పదేపదే జోక్యం చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం విభజనవాద అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు ఐరాస వంటి ప్రతిష్టాత్మక వేదికలను పాకిస్థాన్ దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. భారతదేశ అంతర్గత అంశాలపై తప్పుడు, పక్షపాతపూరిత కథనాలను ప్రచారం చేయడానికి ఐక్యరాజ్యసమితి వేదిక కాదని ఆయన పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని పునరుద్ఘాటించారు. దీనికి విరుద్ధంగా పాకిస్థాన్ చేస్తున్న వ్యాఖ్యలు, వాదనలు వాస్తవాలను ఏమాత్రం మార్చలేవని స్పష్టంచేశారు. ఇప్పటికైనా పాకిస్థాన్ తన వైఖరిని మార్చుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. భవిష్యత్తులో ఎదురయ్యే అంతర్జాతీయ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని భారత ప్రతినిధి అభిప్రాయపడ్డారు.