LOADING...
NHAI: ఏప్రిల్ 1 నుంచి ప్లాజాల వద్ద నగదుకు స్వస్తి.. టోల్ ప్లాజాల్లో కొత్త నిబంధనలు అమలు!
టోల్ ప్లాజాల్లో కొత్త నిబంధనలు అమలు!

NHAI: ఏప్రిల్ 1 నుంచి ప్లాజాల వద్ద నగదుకు స్వస్తి.. టోల్ ప్లాజాల్లో కొత్త నిబంధనలు అమలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 31, 2026
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కీలకమైన మార్పు రాబోతోంది. రేపటి నుంచి,అంటే ఏప్రిల్ 1 నుండి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా రద్దు చేయనున్నట్లు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) వెల్లడించింది. ఇకపై టోల్ ఫీజులు చెల్లించాలంటే ఫాస్టాగ్ లేదా యూపీఐ వంటి డిజిటల్ విధానాలనే వినియోగించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధన దేశంలోని అన్ని జాతీయ రహదారులు,ఎక్స్‌ప్రెస్‌వేలపై అమల్లోకి రానుంది. రహదారి వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద తరచూ కనిపించే వాహనాల క్యూలను తగ్గించడం, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడం ప్రధాన ఉద్దేశ్యం.

వివరాలు 

టోల్ బూత్‌ల వద్ద క్యూ ఆర్ కోడ్

క్యాష్‌లెస్ విధానం అమలుతో టోల్ వసూళ్లలో పారదర్శకత పెరుగుతుంది. అంతేకాకుండా వాహనాలు ఆగకుండా నేరుగా వెళ్లే అవకాశం ఉండటంతో ఇంధన వినియోగం తగ్గి, పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే, డిజిటల్ చెల్లింపులకు అలవాటు లేని ప్రయాణికులకు ప్రారంభంలో కొంత అసౌకర్యం కలగవచ్చు. ఫాస్టాగ్ లేకపోవడం లేదా అందులో సరిపడా బ్యాలెన్స్ లేకపోతే జరిమానాలు విధించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అటువంటి వాహనాలను టోల్ వద్ద నిలిపివేయవచ్చు కూడా. ప్రయాణికుల సౌలభ్యం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశారు. ఒకవేళ ఫాస్టాగ్ పనిచేయకపోతే, టోల్ బూత్‌ల వద్ద అందుబాటులో ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా వెంటనే చెల్లించవచ్చు.

వివరాలు 

ఫాస్టాగ్‌ను బ్యాంక్ ఖాతాతో లింక్ చేసుకోవాలి

అయితే నెట్‌వర్క్ సమస్యల వల్ల కొన్ని సార్లు చెల్లింపులు ఆలస్యం కావచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ప్రయాణానికి ముందుగానే ఫాస్టాగ్ యాక్టివ్‌లో ఉందో లేదో చెక్ చేసుకోవడం, తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఫాస్టాగ్‌ను బ్యాంక్ ఖాతాతో సరిగ్గా లింక్ చేసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా స్మార్ట్‌ఫోన్‌లో యూపీఐ యాప్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని ఎన్‌హెచ్ఏఐ సూచించింది. ఈ కొత్త విధానం భారత రహదారి వ్యవస్థను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా మార్చే కీలక అడుగుగా భావిస్తున్నారు.

Advertisement