Page Loader
ఫెడరేషన్ పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు: డబ్య్లూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌
ఫెడరేషన్ పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని చెప్పిన బ్రిజ్ భూషణ్ సింగ్‌

ఫెడరేషన్ పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు: డబ్య్లూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌

వ్రాసిన వారు Stalin
Jan 20, 2023
06:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌ స్పందించారు. లైంగిక ఆరోపణల నేపథ్యంలో తాను ఫెడరేషన్ పదవి నుంచి వైదొలిగే ప్రసక్తే లేదన్నారు. తనకు ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల ఈ పదవి దక్కలేదన్నారు. ప్రజలు ఎన్నుకోవడం వల్ల తాను ఇక్కడ కూర్చున్నట్లు స్పష్టం చేశారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌తోపాటు పలువురు కోచ్‌లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా వంటి స్టార్ రెజ్లర్లు డబ్ల్యుఎఫ్‌ఐకి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు. అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌‌తో కూడా ఇదే విషయాన్ని చెప్పారు.

దిల్లీ

భారత ఒలింపిక్ సంఘం చీఫ్ పీటీ ఉషకు లేఖ రాసిన రెజ్లర్లు

భూషణ్ సింగ్‌.. బల్గేరియా టోర్నీ సందర్భంగా అమ్మాయిలు బసచేసే హోటల్ గదులకు అడ్డంగా పడుకునేవాడని ఓ అమ్మాయి ఆరోపించింది. దీనిపై భూషణ్ సింగ్‌ స్పందించారు. ఆరోపించిన అమ్మాయి అసలు టోర్నీలోనే లేదని చెప్పారు సింగ్. అంతేకాకుండా తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు బ్రిజ్ భూషణ్ సింగ్‌. తాను ఇంకా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కానీ, క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కానీ కలవలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ)చీఫ్ పీటీ ఉషకు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, ఇతర భారతీయ రెజ్లర్లు లేఖ రాశారు. డబ్య్లూఎఫ్ఐకి సంబంధించిన వ్యవహారాలపై విచారణ జరిపేందుకు తమతో సంప్రదించి కమిటీని నియమించాలని ఐఓఏను అభ్యర్థించారు.