LOADING...
Revanth Reddy: కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో లేదు : సీఎం రేవంత్ రెడ్డి
కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో లేదు : సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో లేదు : సీఎం రేవంత్ రెడ్డి

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 09, 2026
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆలయానికి చేరుకోగానే అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి ఆశీర్వచనాన్ని సీఎం స్వీకరించారు. అనంతరం దేవాలయ అతిథి గృహంతో పాటు ఇతర అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఆలయ ప్రాంగణంలో మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణపై సందేశం ఇచ్చారు.

వివరాలు 

సింగరేణి మెడికల్ బోర్డు అంశాలపై జరుగుతున్న ప్రచారంపై స్పష్టత

అనంతరం 'ప్రజా పాలన - ప్రగతి బాట' కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, సింగరేణి మెడికల్ బోర్డు అంశాలపై జరుగుతున్న ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. కొన్ని జిల్లాలను రద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేయబోతున్నారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సీఎం ఖండించారు. ఏ జిల్లాను తొలగించాలన్నా, కొత్త జిల్లా ఏర్పాటు చేయాలన్నా ప్రభుత్వం ఆలోచనలో లేదని తేల్చి చెప్పారు. సింగరేణి మెడికల్ బోర్డు విషయంలో కూడా కొందరు కావాలనే తప్పుడు, విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. అలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.

వివరాలు 

భూపాలపల్లిని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తామని హామీ

జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ముఖ్యమంత్రి అన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పదలుచుకున్నానని, జిల్లాలను తొలగించడం గానీ, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం గానీ ప్రభుత్వ పరిశీలనలో లేదని తెలిపారు. భవిష్యత్తులో ఎక్కడైనా జిల్లాల పునర్వ్యవస్థీకరణ అవసరమైతే ప్రజలకు బహిరంగంగా తెలియజేసి, శాసనసభలో చర్చించి, ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించినా భూపాలపల్లి ప్రజలు చైతన్యవంతులని, తప్పుడు ప్రచారాన్ని గుర్తించే శక్తి వారికి ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భూపాలపల్లిని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

Advertisement

వివరాలు 

2027లో నిర్వహించనున్న పుష్కరాలపై మాట్లాడిన ముఖ్యమంత్రి 

సింగరేణి మెడికల్ బోర్డు విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని మరోసారి సీఎం ఖండించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు విస్తరించిన సింగరేణి ప్రాంతాల్లో వేలాది కార్మిక కుటుంబాలు జీవిస్తున్నాయని గుర్తు చేశారు. కార్పొరేట్ మెడికల్ బోర్డును రద్దు చేస్తారని, వారసత్వ ఉద్యోగాలు,ఉపాధి అవకాశాలు పోతాయని కొందరు కావాలనే విష ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2027లో నిర్వహించనున్న పుష్కరాలపై కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలో బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ప్రతి ఆలయాన్ని పర్యాటక పుణ్యక్షేత్రాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అటవీ ప్రాంతాల్లో రిసార్టులు ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

Advertisement

వివరాలు 

ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ. 6,116కోట్లు 

గతేడాది సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించుకున్నామని, అలాగే మేడారాన్ని వెయ్యేళ్లకు గుర్తుండేలా అభివృద్ధి చేసి సమ్మక్క-సారలమ్మ జాతరను దక్షిణ కుంభమేళాగా నిర్వహించామని గుర్తు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ. 6,116 కోట్లను కేటాయించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలంగాణ తొలి, మలి విడత ఉద్యమాల్లో వరంగల్ జిల్లా ప్రజల పాత్రతో పాటు కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు, ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలను సీఎం గుర్తు చేశారు.

వివరాలు 

సమ్మక్క-సారలమ్మ జిల్లా మహిళా సమాఖ్యకు రూ. 205 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కు

ఈ బహిరంగ సభలో మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వేదిక నుంచే సమ్మక్క-సారలమ్మ జిల్లా మహిళా సమాఖ్యకు రూ. 205 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు.

Advertisement