Noida: ఉపాధ్యాయుల వాష్‌రూమ్ లోపల స్పై కెమెరా.. నోయిడా స్కూల్ డైరెక్టర్ నిర్వాకం
ఉత్తర్‌ప్రదేశ్ లోని ఒక పాఠశాల డైరెక్టర్ వికృత చర్యలకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. టీచర్లు వినియోగించే బాత్రూంలో స్పై కెమెరా ఏర్పాటు చేసి, తన కంప్యూటర్, మొబైల్ ఫోన్ ద్వారా దానిని పర్యవేక్షిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. వివరాల ప్రకారం, నవనీష్ సహాయ్ అనే వ్యక్తి నోయిడా సెక్టార్ 70లోని ఒక ప్లే స్కూల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 10న,ఒక ఉపాధ్యాయురాలు బాత్రూంలో బల్బ్ హోల్డర్‌లో కెమెరా ఉండటాన్ని గమనించి,ఈ విషయాన్ని నవనీష్,స్కూల్ కోఆర్డినేటర్ పరుల్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే,వారు దీన్ని ఖండించడమే కాకుండా,సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. దీనితో అసహనం చెందిన ఉపాధ్యాయ సిబ్బంది పోలీసులను సంప్రదించారు.
రూ. 22 వేలకు ఆన్‌లైన్లో కెమెరా
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, ఈ ఘనకార్యానికి స్కూల్ డైరెక్టర్ నవనీష్ సహాయ్నే కారణమని తేలింది. రూ. 22 వేలకు ఆన్‌లైన్లో కెమెరాను కొనుగోలు చేసిన విషయాన్ని అతడు అంగీకరించాడు. ఇంకా, గతంలో కూడా బాత్రూంలో స్పై కెమెరా కనుగొన్నామని, అది స్కూల్ కోఆర్డినేటర్‌కు అందజేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని టీచర్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతున్నందున పాఠశాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు.