Amit Shah: మోదీ హయాంలో ఈశాన్య ప్రాంతం శరవేగంగా అభివృద్ధి.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశ చరిత్రను ఎప్పుడు రాసినా.. 2014 నుంచి 2026 మధ్య కాలంలో ఈశాన్య ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని సువర్ణాక్షరాలతో లిఖిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంతానికి మోదీ ప్రభుత్వం ఏం చేసిందని పార్లమెంటులో కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించడం నవ్వు తెప్పిస్తోందని విమర్శించారు. మోదీ ప్రభుత్వ హయాంలో మౌలిక సదుపాయాల కల్పన, విమానాశ్రయాల నిర్మాణం, రైల్వే కనెక్టివిటీ వంటి రంగాల్లో ఈశాన్య ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.
వివరాలు
సియాంగ్ ప్రాజెక్టుపై ప్రజల ఆందోళనలు తొలగిస్తాం
11,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 'సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్' (SUMP)పై స్థానిక ప్రజల్లో ఉన్న ఆందోళనలను త్వరలోనే తొలగిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే క్రమంలో అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, మతపరమైన విశ్వాసాలకు ఎలాంటి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో మార్పులు
జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని అమిత్ షా పేర్కొన్నారు.
35 ఏళ్లకు పైగా అశాంతి, హింసాత్మక పరిస్థితులను ఎదుర్కొన్న కశ్మీర్ లోయలో ప్రస్తుతం శాంతి నెలకొందని తెలిపారు.
ఇప్పుడు ఏ ఒక్క స్థానిక యువకుడికీ ఉగ్రవాదంతో సంబంధం లేదని వ్యాఖ్యానించారు.
కేవలం ఉగ్రవాదులను ఏరివేయడం వల్లే ఈ మార్పు సాధ్యం కాలేదని, కశ్మీర్ యువతలో ఉన్న వివక్ష, పరాయీకరణ భావనలను తొలగించడం కూడా కీలక పాత్ర పోషించిందని వివరించారు.
2014 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు శాశ్వత శాంతికి అవకాశాలను మరింత బలోపేతం చేశాయని అమిత్ షా వెల్లడించారు.