
Ramachandra Rao: బీజేపీ నాయకుడిని కాదు... కార్యకర్తను మాత్రమే.. రామచంద్రరావు స్పష్టత!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు కార్యకర్తలే పార్టీ శక్తికేంద్రమని స్పష్టం చేశారు. నేను పేరుకే అధ్యక్షుడిని, కానీ నా మనసు, పనితీరు మాత్రం కార్యకర్తగా ఉంటాయి.ప్రజల సేవే నా ధ్యేయమని ఆయన చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జనసంఘ్ అభ్యర్థి కేవలం వెయ్యి ఓట్లు పొందినప్పుడు కూడా కార్యకర్తలు టపాసులు పేల్చారు. 'ఇది ఎలాంటి సంబరం?' అని కమ్యూనిస్టులు అడిగితే, 'గతసారికి కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి కదా అని చెప్పారు. అదే ఉత్సాహమే ఇప్పుడు బీజేపీకి 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు తెచ్చింది. సైకిల్‌పై తిరిగి పార్టీ కోసం పనిచేశాం. ఈ రోజు బీజేపీ ఎదిగితే, దానికి కార్యకర్తల త్యాగాలే కారణమని ఆయన భావోద్వేగంతో చెప్పారు.
Details
గోల్కొండపై కాషాయ జెండా ఎగురాల్సిందే
రామచంద్రరావు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవడం గర్వకారణం. నక్సలైట్ల బుల్లెట్లకు బలైన బీజేపీ నేతల త్యాగాలే మాకు మార్గదర్శనం. బీజేపీ మాస్ క్యాడర్‌తో కూడిన సిద్ధాంతబద్ధమైన పార్టీ. అందరం కలిసి గోల్కొండపై కాషాయ జెండా ఎగురేద్దామని అన్నారు. పార్టీలో కొత్త, పాత అనే తేడా లేదని స్పష్టం చేసిన ఆయన, నది ప్రవహించాలంటే కొత్త నీరు రావాల్సిందే. తెలంగాణ యువత, మహిళలు బీజేపీలోకి రావాలి. 33శాతం రిజర్వేషన్ల అమలుతో మహిళలకు మరిన్ని అవకాశాలు వస్తాయి. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా బీజేపీ గెలుపే లక్ష్యమని స్పష్టం చేశారు
Details
బీఆర్ఎస్-కాంగ్రెస్‌కు పోరాడే ధైర్యం లేదు
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వాట్సాప్ యూనివర్సిటీలు స్థాపించి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వీరికి ధైర్యం ఉంటే నేరుగా పోటీ చేయండి. వెనుకనుండి ట్రోలింగ్ చేయడం పిరికితనమే. నేను క్రిమినల్ లాయర్‌ను... ఫేక్ న్యూస్ వెదజల్లేవారిని చట్టపరంగా బోనులో పెట్టేందుకు వెనుకాడనని హెచ్చరించారు. ఏబీవీపీ రోజుల్లోనే జైలుకు వెళ్లొచ్చినవాడిని. లాఠీ దెబ్బలు తిన్నా, సిద్ధాంతాన్ని వీడలేదు. ఇప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉన్నా. న్యాయవాదులతో, విద్యార్థులతో కలిసి పేదల కోసం న్యాయపోరాటం చేసినవాడిని. ఇకపై తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిరంతరం పనిచేస్తాను. బీజేపీని అధికారంలోకి తీసుకొస్తానని బలంగా చెప్పుకొచ్చారు.