LOADING...
Delhi: ఆడంబరం లేకుండా అక్షరాలు పంచుతున్న గురువు… నెటిజన్ల హృదయాలను గెలుచుకున్న కథ
నెటిజన్ల హృదయాలను గెలుచుకున్న కథ

Delhi: ఆడంబరం లేకుండా అక్షరాలు పంచుతున్న గురువు… నెటిజన్ల హృదయాలను గెలుచుకున్న కథ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 17, 2026
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ దిల్లీలోని షేక్ సరాయ్ ప్రాంతం ఎప్పుడూ వాహనాల శబ్దాలతో,పరుగులు తీస్తున్న జనాలతో కిక్కిరిసి ఉంటుంది. ఆ గందరగోళంలో ప్రతి ఒక్కరూ తమ పనులలో మునిగిపోయి ముందుకు సాగుతుంటారు. కానీ అదే రద్దీ మధ్యలో ఒక వ్యక్తి మాత్రం ఆగాడు.తన స్వార్థం కోసం కాదు...సమాజంలో వెనుకబడి ఉన్న చిన్నారుల భవిష్యత్తు కోసం. ఎలాంటి హడావుడి లేదు,ప్రచారం లేదు,కెమెరాల ఆర్భాటం అసలే లేదు. ఫుట్‌పాత్‌పై కూర్చొని, పేద పిల్లలకు అక్షరాలు నేర్పుతూ మానవత్వానికి అసలైన అర్థాన్ని చూపిస్తున్నాడు. ఈ హృదయాన్ని తాకే దృశ్యాన్ని అన్షు కుమార్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా అందరికీ పరిచయం చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ,ఎందరో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.

వివరాలు 

వైరల్ వీడియో వెనుక కథ ఇదే…

ఆ వీడియోలో ఒక వ్యక్తి ఫుట్‌పాత్‌పై కూర్చుని ఉండగా, అతని చుట్టూ కొందరు చిన్నారులు గుమిగూడి ఆసక్తిగా పాఠాలు వింటున్నారు. అక్కడ బ్లాక్‌బోర్డు లేదు, బెంచీలు లేవు. పిల్లలు తమ ఒడిలోనే నోట్‌బుక్‌లు పెట్టుకుని రాసుకుంటున్నారు. ఆ గురువు మాత్రం అపారమైన ఓపికతో, ముఖంపై చిరునవ్వుతో, ప్రతి విషయం స్పష్టంగా వారికి అర్థమయ్యేలా బోధిస్తున్నారు. వీడియో వైరల్ అయిన తర్వాత ఆ గురువు పేరు కృషన్ కుమార్ అని తెలిసింది. వృత్తిరీత్యా ఆయన పీజీటీ టీచర్. తన ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుని, వీధి పిల్లలకు, సరైన విద్యావకాశాలు లేని నిరుపేద చిన్నారులకు ఉచితంగా విద్యను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.

వివరాలు 

ఆడంబరాలకు ఆమడదూరంలో..

ఈ రోజుల్లో చిన్న సహాయం చేసినా దానికి వీడియోలు, రీల్స్, ప్రచారం కావాలనే ధోరణి ఉన్న కాలంలో, ఎలాంటి గుర్తింపు కోరకుండా కృషన్ కుమార్ చేస్తున్న ఈ సేవ నిజంగా అభినందనీయం. "ఈ స్వార్థపూరిత ప్రపంచం తరపున మీకు ధన్యవాదాలు సార్," అంటూ వీడియోను పోస్ట్ చేసిన అన్షు కుమార్ తన భావాలను వ్యక్తం చేశారు.

Advertisement

వివరాలు 

నెటిజన్ల ప్రశంసల వర్షం..

ఈ వీడియో చూసిన వేలాది మంది నెటిజన్లు ఆయన అంకితభావానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. "ఇదే నిజమైన విద్య అంటే,"అని ఒకరు వ్యాఖ్యానించగా,"హీరోలందరూ కేప్స్ ధరించరు, కొందరు ఇలా పుస్తకాలు పట్టుకుంటారు," అని మరొకరు రాశారు. "రీల్స్, ఫేమ్ కోసం పరుగులు తీసే ప్రపంచంలో ఇది స్వచ్ఛమైన బంగారం లాంటి దృశ్యం," అంటూ పలువురు భావోద్వేగానికి లోనయ్యారు. ఇంకొకరు, "ఆయన నా పదో తరగతి టీచర్. ఆయనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా సహాయకరంగా ఉండేవారు. గొప్ప గురువే కాదు, గొప్ప మనిషి కూడా," అంటూ వ్యాఖ్యానించారు.

Advertisement

వివరాలు 

మానవత్వం ఎప్పటికీ బతికే ఉంటుందని ఈ సంఘటన రుజువు చేసింది 

"ఆయన అన్ని అర్థాల్లోనూ నిజమైన ధనవంతుడు," అని మరొకరు అభిప్రాయపడ్డారు. వందల కోట్లు ఖర్చు పెట్టినా దొరకని సంతృప్తి, ఒక నిరుపేద పిల్లాడు అక్షరం నేర్చుకున్నప్పుడు ఆ గురువు ముఖంలో కనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఉన్నంతకాలం మానవత్వం ఎప్పటికీ బతికే ఉంటుందని ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తోంది.

Advertisement