
Sudha Murthy: నా భర్త మాత్రమే కాదు.. మరెందరో 90 గంటలు పనిచేస్తున్నారు : సుధా మూర్తి
ఈ వార్తాకథనం ఏంటి
ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy) ఇటీవల పని గంటలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ విషయంపై ఆయన భార్య, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి (Sudha Murthy) స్పందించారు. ఏ పని అయినా ఇష్టపడి, ఉత్సాహంగా చేస్తే సమయం ఎప్పుడూ సమస్య కాకుండా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
ఒక పని పట్ల ఆసక్తి, అంకితభావం ఉంటే సమయం పరిమితి అనేది ఉండదని ఆమె చెప్పారు.
తన భర్త నారాయణమూర్తి డబ్బులేమీ లేకపోయినా ఇన్ఫోసిస్‌ను స్థాపించాలనే సంకల్పంతో ముందుకు సాగారని చెప్పారు.
అప్పుడు అంకితభావంతో పనిచేసే వ్యక్తులతో కలిసి వారానికి 70 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం కష్టపడ్డారన్నారు.
Details
ఒకరినొకరు సహాయపడాలి
ఇదే విషయాన్ని జర్నలిస్టులు, వైద్యులు, ఇతర రంగాల్లోని వారు కూడా అనుభవిస్తున్నారని, భగవంతుడు అందరికీ రోజుకు 24 గంటల సమయాన్ని ఇచ్చాడు. దానిని ఎలా వినియోగించుకోవాలో మన నిర్ణయమేనని ఆమె తెలిపారు.
సుధా మూర్తి తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ప్రస్తావించారు.
నారాయణమూర్తి ఇన్ఫోసిస్‌ను చూసుకుంటున్నప్పుడు, తాను ఇంటి బాధ్యతలను స్వీకరించానని, పిల్లలను పెంచడమే కాకుండా కళాశాలలో కంప్యూటర్ సైన్స్ బోధించానని గుర్తు చేశారు.
ప్రస్తుతం తాను తన భర్త కంటే ఎక్కువ పని చేస్తుంటానని, ఆయన వెనుక నుంచి మద్దతుగా ఉంటున్నారని వెల్లడించారు.
భార్యాభర్తల వృత్తి జీవితంలో ఒకరికొకరు సహాయపడాలని, అదే నిజమైన జీవితమని అన్నారు.