NTA: మూడు రోజుల్లో నీట్ రీటెస్టు.. విద్యార్థులకు ఎన్‌టీఏ కీలక హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
నీట్-యూజీ రీటెస్టు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) స్పష్టం చేసింది. పరీక్ష రాసే విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండి,పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని సూచించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 21న రీటెస్టు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్ష వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం,తప్పుడు వార్తలను నమ్మవద్దని 'ఎక్స్' వేదికగా విద్యార్థులకు ప్రత్యేక సందేశం ఇచ్చింది. ఎన్‌టీఏ నుంచి వెలువడే అధికారిక ప్రకటనలనే విశ్వసించాలని సూచించింది. ఇదిలా ఉండగా, నీట్ రీటెస్టు ఏర్పాట్లపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులతో చర్చించారు.
వివరాలు
పరీక్ష ఒత్తిడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్
ఈ సందర్భంగా ఎన్‌టీఏ కీలక ప్రకటన విడుదల చేసింది.అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మే 3న నిర్వహించిన నీట్-యూజీ పరీక్షను రద్దు చేసినట్లు గుర్తుచేసింది. ఆ ఘటన నుంచి పాఠాలు నేర్చుకుని పరీక్షా వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు,భద్రతా సంస్థల సమన్వయంతో రీటెస్టు నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. పరీక్ష కేంద్రాల వద్ద బహుళ అంచెల భద్రతా చర్యలు అమలు చేస్తున్నామని,ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. పరీక్ష ఒత్తిడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా'మానస్'మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్‌ను అందుబాటులో ఉంచినట్లు ఎన్‌టీఏ తెలిపింది. అవసరమైన వారు 14416నంబర్‌కు కాల్ చేసి మానసికసాయం పొందవచ్చని సూచించింది.
వివరాలు
అనవసర ఒత్తిడికి గురికావద్దు
అలాగే, పరీక్షకు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని,ఇప్పటివరకు చేసిన సన్నద్ధతపై విశ్వాసం ఉంచి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టి పెట్టాలని అభ్యర్థులకు సూచించింది. ప్రశాంతంగా ఉండి,సరిపడా విశ్రాంతి తీసుకోవాలని,చివరి నిమిషంలో అనవసర ఒత్తిడికి గురికావద్దని కోరింది. తల్లిదండ్రులు,అధ్యాపకులకు కూడా ఎన్‌టీఏ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. ధ్రువీకరించని వార్తలు, సోషల్ మీడియా ప్రచారాలను విద్యార్థులతో పంచుకోవద్దని, వారిలో భయాందోళనలు పెంచే సమాచారానికి దూరంగా ఉంచాలని సూచించింది.
వివరాలు
రీటెస్టు కోసం కేంద్ర ప్రభుత్వం,ఎన్‌టీఏ ప్రత్యేక చర్యలు
విద్యార్థులు ప్రశాంతమైన మనసుతో, ఆత్మవిశ్వాసంతో పరీక్ష కేంద్రాలకు వెళ్లేలా ప్రోత్సహించాలని కోరింది. కాగా, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 3న నిర్వహించిన నీట్-యూజీ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు కొనసాగుతుండగా, రీటెస్టును పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ ప్రత్యేక చర్యలు చేపట్టాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎన్‌టీఏ చేసిన ట్వీట్
📌 A message to our students
— National Testing Agency (@NTA_Exams) June 18, 2026
The NEET UG 2026 examination is just three days away.
To every candidate: you have worked hard, you have prepared, and now is the time to trust your effort. Stay calm, rest well, and focus on doing your best. That is all that is asked of you.
The…