Nuh violence: నుహ్ హింసలో పాల్గొన్నవారిపై ఉక్కుపాదం; రోహింగ్యాల అరెస్ట్
హర్యానాలోని నుహ్‌లో చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో అక్కడ కొన్ని రోజులుగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతున్నాయి. హింసలో పాల్గొన్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒకవైపు ప్రభుత్వం హింసకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వారి హోటళ్లు, ఇళ్లు, అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చేస్తోంది. మరోవైపు నుహ్‌లో హింసాకాండకు సంబంధించిన కేసుల్లో ఇక్కడ నివసిస్తున్న రోహింగ్యాలపై చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పోలీసులు పలువురు రోహింగ్యాలను అరెస్టు చేశారు. హర్యానా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి చెందిన భూమిని రోహింగ్యాలు ఆక్రమించుకున్నారు. ఆ భూమిలో నిర్మాణాలను చేపట్టారు. ఆ ఆక్రమ నిర్మాణాలను ఉపయోగించి జూలై 31న జరిగిన హింసలో రోహింగ్యాలు రాళ్లు రువ్వినట్లు పోలీసులు గుర్తించారు.
సాక్ష్యాల ఆధారంగానే అరెస్టులు: నుహ్ ఎస్పీ
హింసలో పాల్గొన్న వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలను గుర్తించినట్లు నుహ్ ఎస్పీ తెలిపారు. ఆ సాక్ష్యాల ఆధారంగానే వారిని అరెస్టు చేశామన్నారు. రోహింగ్యాల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును రోహింగ్యా హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ ఎన్జీవో ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. రోహింగ్యాలందరూ రోజువారీ కూలీ పనులు చేస్తుంటారని వారు పేర్కొన్నారు. 17మంది రోహింగ్యాలు హింసకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వారిని అరెస్టు చేసి, వారికి సంబంధించిన నిర్మాణాలపై బుల్డోజర్లను కూడా ఉపయోగించారు. జులై 31న నుహ్‌లో మతపరమైన ఊరేగింపు సందర్భంగా రాళ్లు రువ్వడంతో హింస చెలరేగింది. నుహ్‌నుంచి మొదలైన హింస చుట్టుపక్కల జిల్లాలకు వ్యాపించింది. ఈ ఘర్షణల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఇప్పటివరకు 150మందిని అరెస్టు చేయగా, 50కిపైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.