
Waqf Amendment Act: వక్ఫ్ చట్టంపై అభ్యంతరాలు.. సుప్రీంకోర్టు విచారణ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
వక్ఫ్ సవరణ చట్టం-2025 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ మొదలైంది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తోంది.
విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ చట్టరూపాన్ని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 నిరోధించదని స్పష్టం చేసింది.
ఈ నిబంధన లౌకిక స్వభావాన్ని కలిగి ఉండి, సార్వత్రికంగా అందరికీ వర్తించేదని పేర్కొంది. కేంద్రాన్ని ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించింది కోర్టు. వందల ఏళ్లనాటి ఆస్తులకు ఆధారాలు, పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించింది.
వక్ఫ్ చట్టం మీద ప్రజల్లో ఆందోళనలు హింసకు దారి తీస్తున్న ఘటనలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
Details
జాతీయ స్థాయిలో ప్రభావం
పిటిషనర్ల తరఫున న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ చట్టానికి జాతీయస్థాయి ప్రభావం ఉందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి ఈ పిటిషన్లను హైకోర్టులకు పంపవద్దని కోరారు.
మరో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వక్ఫ్ బై యూజర్ అనే పద్ధతి చాలా కాలంగా అమలులో ఉందని న్యాయవాది హుజేఫా అహ్మదీ వివరించారు.
ఇక మరోవైపు, వక్ఫ్ బిల్లుపై కేంద్రం సమాధానం ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ బిల్లుపై విస్తృతంగా చర్చ జరిపిందని తెలిపింది.
తదుపరి విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం ఏప్రిల్ 8 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది.