surrogacy: సరోగసీతో సంతానం పొందిన వారికీ ప్రసూతి సెలవులు.. ఆ రాష్ట్రం కీలక నిర్ణయం
ఒడిశా ప్రభుత్వం సరోగసీ ద్వారా మాతృత్వాన్ని పొందాలనుకునే తల్లుల కోసం ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త నిబంధన ప్రకారం, సరోగసీ ద్వారా సంతానాన్ని పొందిన ప్రభుత్వ ఉద్యోగినులకు ఆరు నెలల ప్రసూతి సెలవులు అందించాలనే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ కింద, మహిళా ఉద్యోగులకు 180 రోజుల సెలవులు, పురుష ఉద్యోగులకు 15 రోజుల సెలవులు తీసుకునే వెసులుబాటు ఉంది.
180 రోజుల మాతృత్వ సెలవులు
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న మహిళలు సరోగసీ ద్వారా సంతానాన్ని పొందితే (కమిషనింగ్ మదర్), వారికి 180 రోజుల మాతృత్వ సెలవులు వర్తిస్తాయి. సరోగసీ కోసం గర్భం అద్దెకిచ్చిన మహిళ కూడా (సరోగేట్) ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటే, ఆమెకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయి.ఇద్దరు సంతానం వరకే సెలవులు పొందొచ్చు. ఈ సెలవులను పొందాలంటే, రిజిస్టర్ చేసిన వైద్యులు లేదా ఆసుపత్రుల ద్వారా సరోగసీ తల్లి, కమిషనింగ్ తల్లీతండ్రి మధ్య ఒప్పందాన్ని సమర్పించాల్సి ఉంటుంది, అని నోటిఫికేషన్‌లో స్పష్టంగా తెలిపింది.
అయిదేళ్లు కలిసి ఉన్న దంపతులే సరోగసీకి అర్హులు
చట్టబద్ధమైన వివాహం ద్వారా ఐదు సంవత్సరాలు కలిసి ఉన్న దంపతులు మాత్రమే సరోగసీకి అర్హులు. భార్య వయస్సు 23-50 సంవత్సరాల మధ్య ఉండాలి, భర్త వయస్సు 26-55 సంవత్సరాల మధ్య ఉండాలి. సాధారణ పద్ధతుల్లో సంతానం కలగని పరిస్థితుల్లో మాత్రమే ఈ దంపతులు సరోగసీ ద్వారా బిడ్డను పొందవచ్చు. సరోగసీ పద్ధతిలో సంతానం పొందుతున్న వారికి మాతృత్వ, పితృత్వ సెలవుల ప్రయోజనాలను కొన్ని నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో, ఒడిశా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.