ఓలా, ఉబర్, రాపిడో బైక్ టాక్సీలపై నిషేధం విధించిన దిల్లీ ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
ఓలా, ఊబర్, రాపిడో బైక్ టాక్సీ సేవలపై దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బైక్ ట్యాక్సీల నిషేధం విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఓలా, ఉబర్, రాపిడో రైడర్స్ వంటి సర్వీస్ ప్రొవైడర్లు దిల్లీలో బైక్ ట్యాక్సీ సేవలను కొనసాగిస్తే జరిమానా విధిస్తామని దిల్లీ రవాణా శాఖ హెచ్చరించింది. నాన్-ట్రాన్స్‌పోర్ట్ రిజిస్ట్రేషన్ ద్విచక్ర వాహనాలను ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఉపయోగిస్తున్నారని పేర్కొంది.
వ్యక్తిగత వాహనాలను కమర్షియల్ ట్యాక్సీలుగా ఉపయోగించడం మోటారు వాహన చట్టాన్ని ఉల్లంఘించడమేనని నోటీసుల్లో పేర్కొంది.
క్యాబ్‌ల ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో ఓలా, ఉబర్, రాపిడో ద్వారా ద్విచక్ర వాహనాలపై ఆధారపడిన అనేక మంది వినియోగదారులపై కూడా ఈ చర్య ప్రభావం చూపుతుంది.
దిల్లీ ప్రభుత్వం
బైక్ టాక్సీ సేవలను కొనసాగిస్తే రూ.5,000 జరిమానా
ఓలా, ఉబర్, ర్యాపిడో రైడర్స్ వంటి సర్వీస్ ప్రొవైడర్లు దిల్లీలో బైక్ టాక్సీ సేవలను కొనసాగిస్తే వాహనానికి రూ.5,000చొప్పున జరిమానా విధిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రెండోసారి లేదా ఆ తర్వాత నేరం చేస్తే రూ.10,000 జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా విధించబడుతుందని హెచ్చరించింది.
దిల్లీ ట్రాఫిక్ పోలీసు విభాగం ఇప్పటికే ఓలా, ఉబర్, రాపిడోతో అనుబంధించబడిన బైక్‌లను తనిఖీ చేస్తోంది.
మహారాష్ట్రలో ర్యాపిడో సేవలను సుప్రీంకోర్టు నిషేధించిన తర్వాత దిల్లీ ప్రభుత్వం కూడా ఈ చర్య తీసుకోవడం గమనార్హం. టూవీలర్ క్యాబ్ సర్వీసుల్లో మరో పెద్ద సమస్య ఏమిటంటే ఎమర్జెన్సీ బటన్ కోసం సరైన ఏర్పాట్లు లేవు. దీంతో మహిళా ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది.