దిల్లీ మద్యం కేసు: 'ఈ నెల 26న విచారణకు రండి'; మనీష్ సిసోడియాను మళ్లీ సీబీఐ సమన్లు
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో విచారణ నిమిత్తం ఫిబ్రవరి 26న మళ్లీ తమ ముందు హాజరు కావాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కోరింది. ఈ మేరకు సమన్లు జారీ చేసింది. సిసోడియా సారథ్యంలో దిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో అవినీతి జరిగినట్లు ఈడీ, సీబీఐ అభియోగాలు మోపాయి. ఈ నేపథ్యంలో మద్యం కేసుకు సంబంధించి సిసోడియాతో పాటు మరో 14మందిపై సీబీఐ గతేడాది ఆగస్టులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో మనీష్ సిసోడియాను సీబీఐ మొదటిసారి విచారణకు పిలిచింది.
సీబీఐ విచారణకు హాజరవుతా: సిసోడియా
అంతకుముందు, ఫిబ్రవరి 19న విచారణకు హాజరు కావాలని సిసోడియాను సీబీఐ కోరింది. దిల్లీ బడ్జెట్ రూపకల్పనకు సంబంధించిన పనులు ఉన్నందున తన విచారణను వాయిదా వేయాలని సీబీఐ అధికారులను సిసోడియా కోరారు. దీంతో ఫిబ్రవరి 19న సిసోడియా విచారణను సీబీఐ వాయిదా వేసింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఈ క్రమంలో సోమవారం తాజా తేదీని వెల్లడిస్తూ, సీబీఐ అధికారులు సమన్లు జారీ చేసినట్లు సిసోడియా చెప్పారు. ఫిబ్రవరి 26న తేదీన దర్యాప్తు సంస్థ ఎదుట హాజరవుతానని సిసోడియా చెప్పారు.