Page Loader
దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ

దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ

వ్రాసిన వారు Stalin
Feb 18, 2023
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ మద్యం కేసులో డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాకు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆదివారం తమ ప్రధాన కార్యాలయానికి రావాలని సీబీఐ సమన్లు జారీ చేసినట్లు సిసోడియా శనివారం ట్వీట్ చేశారు. మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా లభించిన తాజా సాక్ష్యాధారాల ఆధారంగా ఆదివారం సిసోడియాను సీబీఐ విచారించనుంది. ఈడీ, సీబీఐ తమ పూర్తి అధికారాలను తనపై ప్రయోగిస్తున్నాయని, అధికారులు తన ఇంటిపై దాడులు చేసినట్లు పేర్కొన్నారు. తన బ్యాంకు లాకర్‌లో అధికారులు సోదాలు చేశారు కానీ తనకు వ్యతిరేకంగా ఏమీ కనిపించలేదని చెప్పారు. విచారణకు తాను ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటానని సిసోడియా ట్వీట్‌లో పేర్కొన్నారు.

దిల్లీ

గతేడాది అక్టోబర్‌లో మనీష్ సిసోడియాను పిలిచిన సీబీఐ

సిసోడియా సారథ్యంలో దిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో అవినీతి జరిగినట్లు ఈడీ, సీబీఐ అభియోగాలు మోపాయి. ఈ నేపథ్యంలో మద్యం కేసుకు సంబంధించి సిసోడియాతో పాటు మరో 14మందిపై సీబీఐ గతేడాది ఆగస్టులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. గతేడాది నవంబర్‌లో తీసుకొచ్చిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సిఫారసు చేశారు. విచారణకు సిఫార్సు చేసిన అనంతరం దిల్లీ ప్రభుత్వం తన కొత్తం మద్యం పాలసీని ఉపసంహరించుకున్నది. ప్రైవేట్ కంపెనీలను తిరిగి మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో మనీష్ సిసోడియాను సీబీఐ విచారణకు పిలిచింది.