Independence Day: ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు ప్రధాని ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. తొలుత ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మంత్రి అజయ్ భట్, రక్షణ కార్యదర్శి గిరిధర్ అరమనే స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ గౌరవ వందనం స్వీకరించారు. జెండాను ఎగురవేసిన తరువాత, ప్రధానమంత్రి మోదీ జాతీనుద్దేశించి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నరేంద్ర మోదీ వరుసగా పదోసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన ప్రధానుల జాబితాలో చేరారు. వేడుకలకు దేశం నలుమూలల నుంచి సుమారు 1,800 మందిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు.