Haryana: హర్యానా అసెంబ్లీలో విశ్వాస పరీక్ష.. సీఎం నయాబ్ సైనీ విజయం
హర్యానా కొత్త ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో మార్చి 12న నయాబ్ సింగ్ సైనీ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో విశ్వాస పరీక్షను నిర్వహించారు. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన చర్చల అనంతరం మూజువాణి ఓటుతో సైనీ బలపరీక్షను నెగ్గారు. హర్యానా అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 90కాగా.. సైనీ ప్రభుత్వానికి అనుకూలంగా 48ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం సందర్భంగా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ను సీఎం సైనీ ప్రశంసించారు. గత 9ఏళ్లలో ఖట్టర్ ప్రభుత్వం చేసిన పథకాలను ఆయన ప్రస్తావించారు.